Telangana News: జూబ్లీహిల్స్‌ అత్యాచారం.. A-1కు 3రోజుల కస్టడీ

జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసు నిందితుడు సాదుద్దీన్‌ను మూడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది.

Updated : 08 Jun 2022 12:19 IST

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసు నిందితుడు సాదుద్దీన్‌ను మూడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సాదుద్దీన్‌ను.. రేపటినుంచి కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో సాదుద్దీన్‌(18) ప్రధాన నిందితుడు(ఏ-1)గా ఉన్నాడు. మిగిలిన అయిదుగురూ మైనర్లు. మే 28న ఈ సంఘటన జరిగింది.

నిందితుల్లో మిగిలిన ఐదుగురు మైనర్లను కూడా కస్టడీలోకి తీసుకునేందుకు జువైనల్‌ జస్టిస్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించిన విచారణ ఇంకా జరగాల్సి ఉంది. నాంపల్లి కోర్టులో సాదుద్ధీన్‌ను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు కోరినప్పటికీ.. మూడు రోజులే కోర్టు అనుమతి ఇచ్చింది. కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించారు. అయినప్పటికీ ప్రధాన నిందితుడు సాదుద్ధీన్‌ కాబట్టి.. ఇతను మైనర్లను ఏవిధంగా ప్రోత్సహించాడు? బాలికను ఎలా మభ్యపెట్టి వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు? తదితర విషయాలను క్షుణ్నంగా తెలుసుకోవటానికి కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం అతని నుంచి రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. కస్టడీ ముగిసిన అనంతరం నాలుగో రోజు ఉదయం 10 గంటలకు సాదుద్ధీన్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి తిరిగి రిమాండ్‌కు తరలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని