Kushboo: తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయం: ఖుష్బు

ప్రధాని మోదీని చూసి తెరాస అధినేత కేసీఆర్‌ భయపడుతున్నారని నటి, భాజపా నేత ఖుష్బు విమర్శించారు.

Updated : 02 Jul 2022 15:32 IST

హైదరాబాద్‌: ప్రధాని మోదీని చూసి తెరాస అధినేత కేసీఆర్‌ భయపడుతున్నారని నటి, భాజపా నేత ఖుష్బు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశానికి ఖుష్బు హాజరయ్యారు.

ఖుష్బు మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయం. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించడం భాజపాకు పెద్ద కష్టమైన పని కాదు. ఎక్కడైనా పోటీ అనేది ఉండాలి. మాకు సరైన పోటీ ఉండాలనే మేం భావిస్తున్నాం. పోటీ లేకపోతే ఎలాంటి ఆసక్తి ఉండదు. మోదీజీ వెనక్కి పోవాలని.. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్స్‌ పెట్టారు. అవన్నీ చూస్తుంటే తెరాస భయపడుతున్నట్లు తెలుస్తోంది. మూడోసారి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. కేసీఆర్‌ ఆలోచనా విధానం ఎలా ఉందనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలుస్తోంది.

దేశాన్ని, దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు భాజపా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అవన్నీ ప్రజలకు దగ్గరయ్యాయి. దేశంలో ఎక్కడా వారసత్వ పాలన ఉండకూడదు. ఇప్పటికే ఎక్కవ అయింది. ఇంకా వారసత్వ రాజకీయాలను సహించేది లేదు. దేశం ముందుకు వెళ్లాలి కదా.. భాజపా విషయంలో ప్రజలు సంతోషంగా లేకపోతే.. 2019 ఎన్నికల్లో ప్రజలు గెలిపించేవారు కాదు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. అది ప్రజలు చూస్తారు’’ అని ఖుష్బు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని