Hyderabad: సాగర్ చౌరస్తా TO ఉప్పల్‌ రయ్‌..రయ్‌.. మెరుగు పడిన ప్రజా రవాణా

ఎల్బీనగర్‌ కూడలి చుట్టూ..(ఉప్పల్‌ నుంచి సాగర్‌ చౌరస్తా వరకు) భారీగా రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు

Published : 16 Mar 2022 02:15 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ కూడలి చుట్టూ..(ఉప్పల్‌ నుంచి సాగర్‌ చౌరస్తా వరకు) భారీగా రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు ఎల్బీనగర్‌ అండర్‌పాస్‌తో పాటు బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ప్రారంభించనున్నారు. ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద రూ.40కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ అండర్‌పాస్‌, రూ.29కోట్లతో బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌లను నిర్మించారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా సిగ్నల్‌ ఫ్రీ నగరంగా ఏర్పాటు చేసేందుకు ఎస్‌ఆర్‌డీపీ పథకంలో ఫ్లై ఓవర్లు, స్కై వేలు, మేజర్‌ కారిడార్లు, గ్రేడ్‌ సపరేటర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు చేపట్టారు. అందులో భాగంగా ఎల్బీనగర్‌ కూడలి అత్యంత ప్రధానమైంది.

వరంగల్‌, నల్గొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌ నియంత్రణకు, నివారణకు అండర్‌ పాస్‌, ఫ్లై ఓవర్‌ నిర్మాణాలను చేపట్టారు. ఎల్బీనగర్‌ కూడలి (ఆర్‌హెచ్‌ఎస్‌) ఎడమ వైపు రూ.40 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు అండర్‌ పాస్‌ 12.875 మీటర్ల వెడల్పు, 72.50 మీటర్ల బాక్స్‌ పోర్షన్‌ 3 లేన్‌ల యునీ డైరెక్షన్‌లో ఈ అండర్‌పాస్‌ నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అరాంఘర్‌, మిధాని మీదుగా వచ్చే ట్రాఫిక్‌ నివారించేందుకు సుమారు రూ.29 కోట్ల వ్యయంతో బైరామల్‌గూడ (ఎల్‌హెచ్‌ఎస్‌) ఫ్లై ఓవర్‌ 780 మీటర్ల పొడవు, 400 మీటర్ల డక్‌ పోర్షన్‌, 380 ఆర్‌ఈవాల్‌, 12.50 మీటర్ల వెడల్పుతో 3లేన్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కామినేని కూడలిలోని రెండు పైవంతెనలు సేవలందిస్తున్నాయి. నాగోల్‌ కూడలిలో రెండు పైవంతెనల నిర్మాణం పురోగతిలో ఉంది. ఉప్పల్‌ కూడలి నుంచి నారపల్లి వరకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మిస్తోంది. దానికి కొనసాగింపుగా జీహెచ్‌ఎంసీ కూడలి నుంచి రామంతాపూర్‌ వైపు ఓ పై వంతెనను, కూడలి నుంచి క్రికెట్‌ స్టేడియం మీదుగా సికింద్రాబాద్‌ వైపు మరో పై వంతెనను బల్దియా నిర్మించనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని