HYD News: రాయితీ చలాన్లకు రేపటితో ముగియనున్న గడువు... తనిఖీలు ముమ్మరం

ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రేపటితో ముగియనుంది. దీంతో.. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు మరింత ముమ్మరం చేశారు.

Updated : 30 Mar 2022 17:36 IST

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రేపటితో ముగియనుంది. దీంతో.. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. నగర కమిషనర్‌ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చలాన్లు పేరుకుపోవడంతో ఈనెలాఖరు వరకు రాయితీ కల్పించిన పోలీసు శాఖ.. చివరి రెండు రోజులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లు ఆన్‌లైన్‌, లోక్‌ అదాలత్‌ ద్వారా రేపటిలోగా చెల్లించాలని ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75శాతం రాయితీ, నాలుగు చక్రాల వాహనాలకు జరిమానాలో 50శాతం చెల్లిస్తే సరిపోతుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

ద్విచక్రవాహనంపై 97 పెండింగ్‌ చలాన్లు...

రాష్ట్రంలో రూ.వందల కోట్ల ట్రాఫిక్‌ చలాన్లు పెండింగ్‌లో ఉండగా... వాటి వసూలుకు ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించింది. భారీ మొత్తంలో రాయితీలు ప్రకటించినా కొందరు మాత్రం వాటిని ఇంకా ఉపయోగించుకోవడం లేదు. తాజాగా.. చిలకలగూడ చౌరస్తా ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ వాహనదారుడు తారసపడ్డాడు. అతడి ద్విచక్రవాహనంపై 97 పెండింగ్‌ చలాన్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటి విలువ రూ.47వేల పైమాటే. పోలీసులు అతని వాహనాన్ని సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. పెండింగ్‌ చలాన్లు మొత్తం కడితేనే వాహనం తిరిగి ఇస్తామని తేల్చి చెప్పారు. రూ.47వేల జరిమానా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ తీసివేస్తే రూ.12వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వాహనదారుడికి సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని