Telangana News: బండి సంజయ్‌.. రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పండి: ఎర్రబెల్లి

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అబద్ధాలు మాని.. వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Updated : 03 May 2022 15:53 IST

హనుమకొండ: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అబద్ధాలు మాని.. వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్‌ అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని భాజపా ఎంపీలు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. ఉపాధి హామీ పనులు రాష్ట్రంలో మంచి పద్ధతిలో నడుస్తున్నాయని.. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని ఎర్రబెల్లి వివరించారు.

బండి సంజయ్‌ మొదటి నుంచి అబద్ధాలు మాట్లాడతారని ఆరోపించారు. భాజపా నేతలతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. తెలంగాణ మీద ఆయనకు ప్రేమ ఉంటే.. రాష్ట్రానికి ఏం తెచ్చారో ఒక్కటి చెప్పండని ఎర్రబెల్లి ప్రశ్నించారు. స్థానిక ఎంపీగా ఉన్నప్పటికీ కరీంనగర్‌కు మెడికల్‌ కాలేజీ తెచ్చుకోలేని స్థితిలో ఆయన ఉన్నారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నుంచి ఉపాధి హామీ డబ్బులివ్వలేదని బండి సంజయ్‌ ఆరోపించారన్నారు. అది వాస్తవమని.. అయితే ఆ పథకానికి సంబంధించిన నిధులను కేంద్రమే కూలీల్లో ఖాతాల్లో నేరుగా వేస్తోందని మంత్రి చెప్పారు. గతంలో నిధులు ప్రభుత్వానికి వచ్చి.. అక్కడి నుంచి కూలీల ఖాతాల్లోకి వెళ్లేవని వివరించారు. కరోనా సమయంలో పట్టణాల నుంచి స్వగ్రామాలకు చాలా మంది వచ్చారని.. అడిగిన వారందరికీ ఒక్కరోజులోనే జాబ్‌ కార్డులు ఇచ్చామని ఎర్రబెల్లి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని