Telangana News: కేసీఆర్‌.. ఇక్కడేం సాధించారని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారు?: ఈటల

తెలంగాణలో సరైన పరిపాలన అందించలేని సీఎం కేసీఆర్.. ఏం సాధించాలని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో

Published : 21 May 2022 01:53 IST

హైదరాబాద్: తెలంగాణలో సరైన పరిపాలన అందించలేని సీఎం కేసీఆర్.. ఏం సాధించాలని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని తిరగడానికి వెళ్లిన సీఎంను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా లేదు.. సమస్యలు పరిష్కరించే దమ్ము లేదు కానీ దేశ రాజకీయాల్లో ఏదో ప్రభావం చూపిస్తానంటూ పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు గుణపాఠం చెప్పకపోతే తెలంగాణకి అరిష్టమని ప్రజలంతా భావిస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు.

‘‘తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా బిల్లులు చెల్లించడం లేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలమీద పన్నుల భారం మోపారు. లిక్కర్ మీద రెట్లు పెంచారు. భూముల రిజిస్ట్రేషన్, కరెంటు, బస్సు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరానికి రూ.25 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు’’ అని ఈటల విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని