Janasena: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తాం: పవన్‌ కల్యాణ్‌

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు.

Updated : 20 May 2022 16:58 IST

చౌటుప్పల్‌: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటిస్తున్నారు. జనసేనాని రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని పరామర్శించారు. కొంగర సైదులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. జనసేన కార్యకర్తల బీమా పథకం ద్వారా సైదులు భార్యకు రూ.5 లక్షల చెక్కును పవన్‌ అందించారు. అనంతరం కోదాడలోని శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు.

పవన్‌ అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకుపైగా ఓట్లున్నాయి. అయితే వాటితో గెలవలేం. కానీ.. కచ్చితంగా తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందని మాత్రం చెప్పగలను. తెలంగాణ రాజకీయాలను జనసేన శాసిస్తుంది. తెలంగాణలో జనసేన బలోపేతానికి పనిచేస్తాం. రాజకీయాల్లో దెబ్బతిన్న వాడిని కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జనసేన బలాలు.. బలహీనతలు నాకు బాగా తెలుసు. తెలంగాణలో ప్రతి జిల్లాలో.. ప్రతి గ్రామంలో జనసేన కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ప్రతి చోటా మాకు అభిమానుల అండ ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని పార్టీ నేతలతో చర్చించి తీసుకుంటాం. తెలంగాణలో సామాజిక మార్పు కోరుకుంటున్నారు. ఆశయం కోసం నిలబడేవాడికి ఎప్పటికీ ఓటమి ఉండదు’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని