ICRISAT : మీ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలి : మోదీ

ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్తదారి చూపాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వసంతపంచమి రోజున స్వర్ణోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు

Updated : 05 Feb 2022 17:26 IST

హైదరాబాద్‌ : ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్తదారి చూపాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వసంతపంచమి రోజున స్వర్ణోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ స్వర్ణోత్సవాల లోగోను, స్టాంప్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. గత 50 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్‌ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.  వాతావరణ మార్పులకు తట్టుకునే వంగడాలు తయారు చేయాలన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్‌ పరిశోధనలు దోహదం చేయాలని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ భారత్‌లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారు. దేశంలో చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారు. సన్నకారు రైతలు సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉంది. పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వ్యవసాయరంగ బలోపేతానికి శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాలి. భారత్‌లో 6 రుతువులు, 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. భారత్‌లో 50 వరకు ఆగ్రో క్లైమేట్‌ జోన్లు ఉన్నాయి. దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయి’’ అని మోదీ పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడుతున్నట్లు మోదీ తెలిపారు. డిజిటల్‌ ఆగ్రికల్చర్‌ పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పారు. డిజిటల్‌ అగ్రికల్చర్‌తో వ్యవసాయరంగంలో పెనుమార్పులు రానున్నాయన్నారు. సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలన్నారు. ‘‘ఈ బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుతున్నాం. సాగులో డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిధులు కేటాయిస్తున్నాం. సాగు భూముల వివరాలను డిజిటలైజ్‌ చేశాం’’ అని మోదీ చెప్పారు.

పామ్‌ ఆయిల్‌ సాగులో అభివృద్ధి సాధించాలి

పామ్‌ ఆయిల్‌ ఉత్పత్తిలో ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉందని మోదీ తెలిపారు. తెలంగాణలో ఆయిల్ పామ్‌ సాగు ఆశావహంగా ఉందన్నారు. పామాయిల్‌ సాగుతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఆహార భద్రతోపాటు పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బయో ఫ్యూయెల్‌తో రైతులకు సాగు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. పరిశోధనలు, ఆవిష్కరణలు రైతుల సమస్యలను తీర్చాలని, అంతిమంగా అందరి లక్ష్యం.. వ్యవసాయాభివృద్ధేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని