Durgam cheruvu cable bridge: హద్దు మీరితే చర్య తప్పదు!

చేతిలో ద్విచక్ర వాహనం, విశాలమైన రోడ్డు ఉంటే యువత విన్యాసాలు చేస్తుంటారు

Published : 12 Aug 2021 14:33 IST

హైదరాబాద్‌: చేతిలో ద్విచక్ర వాహనం, విశాలమైన రోడ్డు ఉంటే యువత విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫొటోలకు ఫోజులు ఇస్తూ తమకు ఎదురేలేదంటూ కాలర్ ఎరగేస్తారు. అయితే దుర్గం చెరువు తీగల వంతెనపై మాత్రం ఆ పప్పులుడకవు. వాహనం ఆగిందంటే చలాన్ తోపాటు సామాజిక మాధ్యమాల్లో మీమ్ పడటం ఖాయం.

హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర తీగల వంతెనపై ఓ వ్యక్తి రోడ్డు పైకి వచ్చి డాన్సులు చేశాడు. ఇంతలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి గమనించిన పోలీసులు రోడ్డుపై పాదచారులు రావడం నిషేధమని హెచ్చరించారు. అయినా ఆ వ్యక్తి నృత్యం చేసి అక్కడి నుంచి జారుకున్నాడు. 

వంతెనపై వాహనం నిలిపేందుకు అనుమతి లేకున్నా ఓ వ్యక్తి ఫొటో దిగడానికి బైక్‌ పార్క్‌ చేశాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కంట్రోల్‌ రూం నుంచి అనౌన్స్‌మెంట్‌ రావడంతో భయపడిన ఆ వ్యక్తి ‘నువ్వు వద్దూ నీ ఫొటో వద్దూ’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

తాజాగా మరికొంత మంది యువకులు హద్దుమీరి ప్రవర్తించారు. ద్విచక్రవాహనాలతో తీగల వంతెన మీదకు వచ్చిన ఆరుగురు బైకులతో విన్యాసాలు చేశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా రోడ్డుకు అడ్డంగా ద్విచక్రవాహనాలు ఆపి హంగామా చేశారు. కంట్రోల్‌ రూం సమాచారంతో అక్కడికి చేరుకున్న మాదాపూర్‌ పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. జరిమానా విధించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని