Ts News: బీఆర్కే భవన్‌ వద్ద ఉపాధ్యాయుల ఆందోళన.. అరెస్టు

 తొలుత ఎంపిక చేసుకున్న మల్టీ జోన్‌కు తమ బదిలీలు చేయాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు

Published : 17 Jan 2022 11:47 IST

హైదరాబాద్‌: తొలుత ఎంపిక చేసుకున్న మల్టీ జోన్‌కు తమ బదిలీలు చేయాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానోపాధ్యాయులు కోరుకున్న జోన్లకు కాకుండా ఇతర జోన్లకు కేటాయించడంతో కొద్ది రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్కే భవన్ ముందు ఇవాళ ఆందోళనకు దిగారు. జీఏడీ నిబంధనల మేరకే బదిలీలు చేశామని అధికారులు చెప్పారని.. అయితే తాము గతంలో ఎంపిక చేసుకున్న జోన్లను పరిశీలించాలని కోరినట్లు తెలిపారు. ఇతర జోన్లకు బదిలీ అయిన 40 మంది హెచ్ఎంలు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నారని కొంత మంది ప్రధానోపాధ్యాయులు వివరించారు.

ప్రగతి భవన్ వద్ద పటిష్ఠ బందోబస్తు..

ప్రగతి భవన్ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు ప్రగతి భవన్‌ను ముట్టడించే అవకాశం ఉండటంతో... అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులపైనా పోలీసులు నిఘా పెట్టారు. ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు నగరానికి వచ్చే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన పోలీసులను నగర పోలీసులు సమన్వయం చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. 317 జీవోను సవరించాలని, జీవిత భాగస్వామి బదిలీలను పరిగణనలోకి తీసుకోవాలని, సీనియారిటీ జాబితాలోని తప్పులను సవరించాలని, జోన్, మల్టీ జోన్‌లోని తప్పులను సరిచేయాలని ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని