TS News: పాఠశాలల పునఃప్రారంభం.. సన్నద్ధతపై మంత్రుల సమీక్ష

రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో

Updated : 24 Aug 2021 17:23 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సన్నద్ధతపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్య, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సమీక్షించారు. పాఠశాలల పునఃప్రారంభానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, విద్యార్థుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని మంత్రి సబిత ఆదేశించారు.

సమావేశం అనంతరం సబితా మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 30 నాటికి విద్యా సంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించినట్లు చెప్పారు. 65 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు రానున్నారని.. ఈ మేరకు తల్లిదండ్రులకు వారి పిల్లల ఆరోగ్యం పట్ల విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేది లేదని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు సైతం కోరుతున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో విద్య, వైద్యారోగ్య, పురపాలక శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలు పరిశుభ్రత చర్యలు చేపట్టాలని, ప్రజాప్రతినిధులు పాఠశాలలను పరిశీలించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నుంచి ఉన్నతాధికారులకు రోజువారి నివేదిక అందించాలన్నారు. కొవిడ్‌ నిబంధనలతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వసతి కల్పించాలని పేర్కొన్నారు. ఎవరికైనా కొవిడ్ నిర్ధారణ అయితే తక్షణమే తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించాలని ఆదేశించారు. గురుకులాలు, వసతి గృహాల్లో  పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫీజులపై గతంలో జారీ చేసిన ఆదేశాల పాటించాలని.. కేవలం ట్యూషన్‌ ఫీజును నెల వారీగానే వసూలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

ఆ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదే: ఎర్రబెల్లి

పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులదేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పష్టం చేశారు. పంచాయతీల ద్వారా మాస్క్‌లను కొనుగోలు చేస్తామని.. ప్రతి విద్యార్థికి మూడు చొప్పున అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. నిధులకు ఎలాంటి కొరత లేదని.. అవసరమైతే అన్ని నిధులను వాడుకునేలా వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకంటామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని