టీచర్లకు ఆర్మీ పాఠశాలల ఆహ్వానం

ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసినవారికి చక్కటి  అవకాశం వచ్చింది! ప్రతిష్ఠాత్మకమైన ఆర్మీ పబ్లిక్‌ పాఠశాలల్లో దాదాపు ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు.  ఏటా పెద్దసంఖ్యలో ఖాళీలు ఏర్పడుతుంటాయి..

Published : 09 Oct 2018 09:18 IST

ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసినవారికి చక్కటి  అవకాశం వచ్చింది! ప్రతిష్ఠాత్మకమైన ఆర్మీ పబ్లిక్‌ పాఠశాలల్లో దాదాపు ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు.  ఏటా పెద్దసంఖ్యలో ఖాళీలు ఏర్పడుతుంటాయి. 2018కి సంబంధించి వీటి భర్తీకి మొదటిదశ అయిన కంబైన్డ్‌ సెలక్షన్‌ స్క్రీనింగ్‌ పరీక్షకు ప్రకటన వెలువడింది. దీనిలో నెగ్గితే తర్వాతి రెండు దశలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సాధించటానికి ఇప్పటినుంచే ముందడుగు వేయాలి!

టీచర్లకు ఆర్మీ పాఠశాలల ఆహ్వానం

దేశవ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లు ఉన్నాయి. 2018కి ఏర్పడిన ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి సంయుక్త ప్రకటన వెలువడింది. మొదటిదశ స్క్రీనింగ్‌ పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఆయా పాఠశాలల నుంచి విడివిడిగా ప్రకటనలు వెలువడినప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలలు, సబ్జెక్టులవారీ ఖాళీల వివరాలు నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు లభిస్తాయి.


అర్హత..

పీజీటీ:  పీజీ, బీఎడ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత 
టీజీటీ: గ్రాడ్యుయేషన్‌, బీఎడ్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత 
పీఆర్‌టీ: గ్రాడ్యుయేషన్‌,  బీఎడ్‌ లేదా రెండేళ్ల డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత (టీజీటీ, పీజీటీ పోస్టులకు ఎంపికకావడానికి సీటెట్‌ లేదా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అయితే ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష రాసుకోవడానికి సీటెట్‌ లేదా టెట్‌ అవసరం లేదు.)


వయసు

ఏప్రిల్‌ 1, 2019 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి. బోధనలో అయిదేళ్లు అనుభవం ఉంటే 57లోపువాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎంపిక ఇలా...

మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో ముఖాముఖి ఉంటుంది. మూడో దశలో టీచింగ్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీపై పరీక్ష ఉంటుంది. వీటిని సెలక్షన్‌ కమిటీ పరిశీలిస్తుంది. భాషోపాధ్యాయులకైతే ఎస్సే, కాంప్రహెన్షన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 15 మార్కులు కేటాయించారు. స్క్రీనింగ్‌ అర్హత సాధించినవారికే రెండు, మూడు దశలు ఉంటాయి.


పరీక్ష ఇలా...

టీజీటీ, పీజీటీ పోస్టులకు 180 మార్కులకు 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. పార్ట్‌ ఎలో జనరల్‌ అవేర్‌నెస్‌, మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌, ఎడ్యుకేషన్‌ కాన్సెప్టులు, మెథడాలజీ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి 90 మార్కులు. పార్ట్‌ బి ఆ సబ్జెక్టుకు సంబంధించింది. ఈ విభాగానికీ 90 మార్కులు కేటాయించారు. రెండు విభాగాల్లో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి.  పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి పార్ట్‌ ఎలో మాత్రమే పరీక్ష ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. మార్కులు 90. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. 
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు: అక్టోబరు 24 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు 
స్క్రీనింగ్‌ పరీక్ష: నవంబరు 17, 18న నిర్వహిస్తారు. 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, సికింద్రాబాద్‌. 
వెబ్‌సైట్‌:  http://apsncsb.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని