Gas Price: కొండెక్కిన గ్యాస్‌బండ

చమురు సంస్థలు మళ్లీ ధరల కొరడా ఝుళిపిస్తున్నాయి. అయిదున్నర నెలల విరామం తర్వాత గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను మంగళవారం రూ.50

Updated : 23 Mar 2022 04:58 IST

గృహావసరాల సిలిండర్‌ ధర రూ.50 పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: చమురు సంస్థలు మళ్లీ ధరల కొరడా ఝుళిపిస్తున్నాయి. అయిదున్నర నెలల విరామం తర్వాత గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను మంగళవారం రూ.50 పెంచాయి. తాజాగా డీజిల్‌పై లీటరుకు 87 పైసలు, పెట్రోలుపై 90 పైసల చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. అక్టోబరు నుంచి గ్యాస్‌, నవంబరు నుంచి పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నాటి నుంచి వాటి ధరలకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల హడావుడి సద్దుమణిగింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు, గ్యాస్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. తొలుత చమురు సంస్థలు బల్క్‌ వినియోగదారులకే ధరలు పెంచాయి. తాజాగా రిటైల్‌ వినియోగదారులపైనా భారం మోపడం ప్రారంభించాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధర అక్టోబరులో రూ.952గా ఉంది. ఆ ధరను తాజాగా హైదరాబాద్‌లో రూ.1,002కు పెంచాయి. మునుపటి ధరతో పోలిస్తే రూ.50 పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌ ధర మాత్రం రూ.2,195 నుంచి రూ.2,186.50కు తగ్గింది.

ధరాభారంపై వినూత్న నిరసన

తరచూ పెరుగుతున్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు సామాన్యుల పాలిట గుదిబండగా మారుతున్నాయంటూ సిద్దిపేట బల్దియా మహిళా కౌన్సిలర్లు వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. మంగళవారం సిద్దిపేటలోని బీజేఆర్‌ చౌరస్తాలో సిలిండర్‌ పక్కన కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి తేనీరు కాచారు. అనంతరం సిలిండర్ల చుట్టూ బతుకమ్మ ఆడిపాడారు. చమురు ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

-న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని