పశ్చిమబెంగాల్‌లో ఉత్కంఠే!

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న శాసనసభ ఎన్నికల సమరంలో ఫలితాలు ఏమిటనేది మే 2న తేలిపోనుంది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌, భాజపా మధ్య సమరం నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రంలో చిట్టచివరి దశ పోలింగ్‌ గురువారం సాయంత్రం ముగిసిన వెంటనే ఆ రాష్ట్రం సహా ఐదు చోట్ల ఓటరు తీర్పు ఎలా ఉండవచ్చనే విషయమై వివిధ సంస్థలు తమతమ

Updated : 30 Apr 2021 09:10 IST

తృణమూల్‌, భాజపా మధ్య హోరాహోరీ
అస్సాంలో కమలం ముందంజ  
కేరళలో వామపక్ష కూటమి  
తమిళనాట డీఎంకే
  కాంగ్రెస్‌కు పుదుచ్చేరిలోనూ ఎదురుదెబ్బే!  
ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా  

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న శాసనసభ ఎన్నికల సమరంలో ఫలితాలు ఏమిటనేది మే 2న తేలిపోనుంది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌, భాజపా మధ్య సమరం నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రంలో చిట్టచివరి దశ పోలింగ్‌ గురువారం సాయంత్రం ముగిసిన వెంటనే ఆ రాష్ట్రం సహా ఐదు చోట్ల ఓటరు తీర్పు ఎలా ఉండవచ్చనే విషయమై వివిధ సంస్థలు తమతమ అంచనాలను వెల్లడించాయి. కేరళలో ఒక ఎన్నికల్లో ఓడిన కూటమి.. తదుపరి ఎన్నికల్లో గెలవడం అనే సంప్రదాయానికి ఈసారి చెల్లుచీటీ తప్పదని, పినరయి విజయన్‌ నేతృత్వంలోని వామపక్ష కూటమే మళ్లీ అధికారంలోకి వస్తుందని మూడు సంస్థలు ఏకగ్రీవంగా అంచనా కట్టాయి. ఇటు తమిళనాడులో డీఎంకే కూటమి విషయంలోనూ ఇవి విస్పష్టమైన అంచనాలనే వెల్లడించాయి. అస్సాం, కేరళల్లో కాంగ్రెస్‌కు అవకాశాలు లేవని, పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని కోల్పోయి విపక్ష కూటమి (ఏఐఎన్‌ఆర్‌సీ- భాజపా- అన్నాడీఎంకే)కి పగ్గాలు అప్పగించడం ఖాయమని సర్వేలు పేర్కొంటున్నాయి.
చివరి విడతలో 80% పోలింగ్‌
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ శాసనసభ ఎన్నికల చివరి (ఎనిమిదో) దశ పోలింగ్‌ గురువారం ముగిసింది. దాదాపు 80% మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి బెంగాల్‌ ఎన్నికలు అనేక వివాదాలను రేకెత్తించిన విషయం తెలిసిందే.
తిరుపతిలో వైకాపాకు 65.85% ఓట్లు?
హైదరాబాద్‌: తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఈ నెల 17న జరిగిన ఉప ఎన్నికలలో వైకాపా విజయం సాధిస్తుందని ‘ఆరా’ అనే సర్వే సంస్థ అంచనా వేసింది. ఈ వివరాలను గురువారం సాయంత్రం వెల్లడించింది. ఈ ఎన్నికలలో వైకాపా అభ్యర్థి గురుమూర్తికి 65.85%, తెదేపా అభ్యర్థిని పనబాక లక్ష్మికి 23.10%, భాజపా అభ్యర్థిని రత్నప్రభకు 7.34% ఓట్లు లభించే అవకాశం ఉందని, ఇతరులకు 3.71% ఓట్లు రావచ్చని తన అంచనాగా తెలిపింది. వీటిలో వైకాపా, తెదేపాల ఓట్లు 3 శాతం అటూ ఇటూ కావొచ్చని, భాజపా, ఇతరుల ఓట్లు 2% అటూ ఇటూ కావొచ్చని చెప్పింది.

‘సాగర్‌’లో తెరాసకు 50 శాతం ఓట్లు!
ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది. తెరాస 50.48 శాతం ఓట్లు దక్కించుకుంటుందని.. కాంగ్రెస్‌కు 39.93 శాతం, భాజపాకు 6.31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆరా సంస్థ పేర్కొంది. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ వివరాలను గురువారం విడుదల చేసింది. మరోవైపు తమ సర్వేలో తెరాసకు 48-50 శాతం, కాంగ్రెస్‌కు 38-42 శాతం, భాజపాకు 6-8 శాతం ఓట్లు వస్తాయని పొలిటికల్‌ లేబొరేటరీ సంస్థ తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని