Ukraine Crisis: శరణార్థులపై వంకర బుద్ధి

యుద్ధ భీతితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... పొరుగు దేశాలకు చేరుతున్న ఉక్రెయిన్‌ చిన్నారులు, బాలికలు, మహిళలపై మృగాళ్లు కన్నేస్తున్నారు. ఆశ్రయం పేరుతో వారిని లొంగదీసుకుని, ఆపై ‘వంకర బుద్ధి’ ప్రదర్శిస్తున్నారు. రష్యా సైనిక చర్యతో

Updated : 15 Mar 2022 04:38 IST

ఆశ్రయం, ఉపాధి కల్పిస్తామంటూ  బాలికలు, యువతులకు వల
కొన్నిచోట్ల కేవలం మహిళలకే వసతి
వీరికి లైంగిక దాడుల ముప్పు
ఉక్రెయిన్‌ నుంచి వచ్చినవారికి తప్పని అగచాట్లు
ఐరాస బృందం పరిశీలనతో వెలుగులోకి...

సిరెట్‌: యుద్ధ భీతితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... పొరుగు దేశాలకు చేరుతున్న ఉక్రెయిన్‌ చిన్నారులు, బాలికలు, మహిళలపై మృగాళ్లు కన్నేస్తున్నారు. ఆశ్రయం పేరుతో వారిని లొంగదీసుకుని, ఆపై ‘వంకర బుద్ధి’ ప్రదర్శిస్తున్నారు. రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్‌ నుంచి చాలామంది పోలండ్‌, రొమేనియా, హంగరీ, మాల్డోవా, స్లొవేకియా తదితర దేశాలకు వెళ్లారు. అయితే, పలువురు వ్యక్తులు, వాలంటీర్లు వారికి ఆహ్వానం పలుకుతున్నారు. ఉచితంగా ఆహారం, రవాణా, వసతి సదుపాయాలు కల్పిస్తూ... ఉపాధి అవకాశాలు పొందడానికి తోడ్పడుతున్నారు. కానీ, వీరిలో కొందరి ఉద్దేశాలు వేరు! కొత్త ప్రదేశంలో, భాష తెలియని చోట, ఏంచేయాలో తెలియక, భవిష్యత్తును వెతుక్కునే క్రమంలో- శరణార్థుల్లోని చాలామంది మహిళలు, బాలికలు, చిన్నారులు... స్థానికులను నమ్ముతున్నారు. మరో దారిలేక వారు చెప్పినట్టు చేస్తున్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు జరుగుతున్నట్టు కొన్ని ఉదంతాలు తాజాగా వెలుగుచూశాయి. పోలండ్‌కు వచ్చిన 19 ఏళ్ల బాలికను స్థానికుడైన 49 ఏళ్ల వ్యక్తి ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే నిందితుడికి 12 ఏళ్ల జైలుశిక్ష తప్పదని అధికారులు పేర్కొన్నారు. ఉపాధి కల్పిస్తామంటూ 16 ఏళ్ల బాలికను మరో వ్యక్తి మభ్యపెట్టాడు. మెడికా సరిహద్దులో ఓ వ్యక్తి కేవలం మహిళలకు, పిల్లలకు మాత్రమే ఆశ్రయం కల్పిస్తుండం తాజాగా వెలుగుచూసింది. పోలీసులు ప్రశ్నించడంతో నిర్వాహకులు కట్టుకథలు చెప్పారు. ఈ ఘటనలతో శరణార్థుల భద్రత, ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాలికలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మానవ అక్రమ రవాణాదారులు రెచ్చిపోయే ప్రమాదముందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పరిశీలనతో వెలుగులోకి...

ఐరాస హైకమిషనర్‌ ఫర్‌ రెఫ్యుజీ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ జాంగ్‌ విలియమ్స్‌ నేతృత్వంలోని బృందం ఇటీవల రొమేనియా, పోలండ్‌, మాల్డోవా సరిహద్దుల్లోని మానవతా శిబిరాలను సందర్శించింది. చాలా శిబిరాల్లోని శరణార్థులంతా మహిళలు, చిన్నారులే ఉంటున్నట్టు తేలింది. వీరు లైంగిక దాడులకు, అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదముందని ఐరాస బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ నుంచి 10 లక్షల మంది చిన్నారులు సహా 25 లక్షల మంది ఆ దేశాన్ని వీడినట్టు యూఎన్‌హెచ్‌సీఆర్‌ ప్రాథమికంగా అంచనా వేసింది.

చేతిలో చిల్లిగవ్వలేక...

భారీగా శరణార్థులు వస్తుండటం వల్ల వారిపై లైంగిక దాడులు, మనుషుల అక్రమరవాణా ముప్పు ఎక్కువగా ఉండొచ్చని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ టమారా బార్నెట్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘శరణార్థుల చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తక్షణ సాయం కోసం ఎవరో ఒకరిపై ఆధారపడాలి. బతకడం కోసం ఏదన్నా చేయక తప్పని పరిస్థితులు ఉంటాయి. వారి బలహీనతలను వంకర బుద్ధితో సొమ్ము చేసుకునేవారు, లైంగిక దోపిడీకి పాల్పడేవారు, వారిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించేవారు ఉంటారు. చాలామంది వాలంటీర్లు బాలికలు, మహిళలను తమ ఇళ్లలోకి ఆహ్వానించడం చూస్తున్నప్పుడు నా బుర్రలో ఇలాంటి ఆందోళనలే రేకెత్తాయి’’ అని ఆమె పేర్కొన్నారు.

అర్థమయ్యేలా హెచ్చరికలు..

తాజా పరిణామాలతో చాలాచోట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిద్రపోయేందుకు వసతి కల్పిస్తామని, రాత్రి వచ్చి పడుకోవచ్చని ఎవరైనా చెబితే నమ్మవద్దంటూ బెర్లిన్‌లోని పోలీసులు ఉక్రెయిన్‌, రష్యన్‌ బాషల్లో శరణార్థులను హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడేవారిని పట్టుకునేందుకు పోలండ్‌, రొమేనియా పోలీసు అధికారులు సాధారణ దుస్తుల్లో తిరుగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని