Updated : 28 Jan 2022 05:19 IST

Air India: ఆంగ్లేయ అడ్డుపుల్లలు.. ఐనా ఎగిరిన టాటా!

భారత్‌ను అన్నింటా అణగదొక్కాలని చూసిన బ్రిటిష్‌ ప్రభుత్వం 1932లోనే టాటాలను ఎలా ఎగరనిచ్చింది? నిజానికి అదేమంత సులభంగా సాధ్యం కాలేదు. ఆంగ్లేయుల ఎన్నో అడ్డుపుల్లల్ని ఛేదించుకుంటూ... పట్టుబట్టి మరీ  టాటాలు ఎయిర్‌లైన్స్‌కు అనుమతి పొందారు. ఆంగ్లేయులకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు.

భారత్‌లో గగనయానం తొలిసారిగా 1911లో చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఫ్రెంచ్‌ పైలెట్‌ హెన్రీ పీక్యూ ఇనుప వైర్లు కట్టిన చెక్క ఫ్రేమ్‌తో కూడిన హంబర్‌ బైప్లేన్‌ను అలహాబాద్‌లోని పోలో గ్రౌండ్‌ నుంచి నైని జంక్షన్‌ దాకా ఎగిరించారు. 6500 ఉత్తరాలను ఈ విమానం మోసుకొని వచ్చింది. 10 కిలోమీటర్ల ఈ దూరాన్ని చేరటానికి 13 నిమిషాలు పట్టింది.
ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు ఇలా ఉత్తరాల విమానాలు అడపాదడపా నడిచాయి. 1929లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి చెందిన ఇంపీరియల్‌ ఎయిర్‌వేస్‌ భారత్‌కు సేవలను మొదలెట్టింది. లండన్‌ నుంచి కరాచీకి తొలి విమానం 20 చోట్ల ఆగుతూ 6-7 రోజుల్లో చేరుకుంది.  
అదే ఏడాది... భారత తొలి ఫ్లయింగ్‌ క్లబ్‌ ఏరో క్లబ్‌ ఆఫ్‌ ఇండియా-బర్మా ఆరంభమైంది. ఈ క్లబ్‌ ద్వారా... టాటా యువ వారసుడు జేఆర్‌డీ టాటా పైలెట్‌ లైసెన్స్‌ పొందారు. విదేశాల్లో విమాన పోటీల్లో పాల్గొని ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆయనకు బ్రిటిష్‌ విమానయాన నిపుణుడు, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ తరఫున యుద్ధ విమానాలు నడిపిన నెవిల్‌ విన్సెంట్‌ పరిచయమయ్యారు. భారత్‌లో విమానయానానికి మంచి భవిష్యత్‌ ఉందని ఊహించిన విన్సెంట్‌ తొలుత భారత్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్త సర్‌ హోమీ మెహతాను కలిశారు. కానీ ఆయన తిరస్కరించారు. దీంతో... టాటాలను సంప్రదించారు. యువకుడే కాకుండా పైలెట్‌ లైసెన్స్‌తో ఉరకలెత్తుతున్న జేఆర్‌డీ తమ సంస్థ ఛైర్మన్‌ సర్‌ దొరాబ్జి టాటా వద్దకు ఈ ప్రతిపాదన తీసుకెళ్లారు. తొలుత అంతగా ఆసక్తి చూపని ఆయన... చివరకు విన్సెంట్‌ మాటలకు అంగీకరించారు. రూ.2లక్షల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు.

వెంటనే దేశంలో ఎయిర్‌లైన్స్‌ ఆరంభించటానికి అనుమతులు కోరుతూ టాటాలు బ్రిటిష్‌ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ తమ ఇంపీరియల్‌ ఎయిర్‌లైన్స్‌ సేవల్నే విస్తరించాలనుకున్న ఆంగ్లేయులు అనుమతులివ్వకుండా నాన్చసాగారు. మూడేళ్లపాటు కొర్రీలు పెడుతూ వచ్చారు. విన్సెంట్‌ మళ్ళీ రంగంలోకి దిగారు. బ్రిటిష్‌ బ్యూరోక్రసీని దాటి... ఏకంగా వైస్రాయ్‌తో తేల్చుకోవటానికి సిద్ధపడ్డారు. సిమ్లా విడిదిలో ఉన్న లార్డ్‌ విలింగ్టన్‌ దగ్గరకు స్వయంగా వెళ్లారు. దొరాబ్జిని ఒప్పించినట్లే... వైస్రాయ్‌నూ ఒప్పించారు. 1932 ఏప్రిల్‌ 24న పదేళ్ల ఒప్పందంతో అనుమతులు లభించాయి. టాటా ఎయిర్‌మెయిల్‌ ఆవిర్భవించింది. 1932 అక్టోబరు 15న కరాచీ నుంచి ముంబయికి తొలి టాటా విమానం గాల్లోకి ఎగిరింది. దాని సగటు వేగం గంటకు 80 కి.మీ. జేఆర్‌డీ టాటా తానే స్వయంగా పైలెట్‌గా వ్యవహరించారు. ఆ కాలంలో కరాచీ నుంచి ముంబయికి రైల్లో 45 గంటల సమయం పట్టేది. టాటా విమానం 8గంటల్లోపే చేరుకుంది. అహ్మదాబాద్‌లో ఆగినప్పుడు బర్మా షెల్‌ పెట్రోల్‌ డబ్బాలను ఎద్దుల బండిపై రన్‌వే వద్దకు తీసుకొచ్చి విమానంలోకి నింపారు. తర్వాత ముంబయి నుంచి బళ్లారి మీదుగా మద్రాసుకు బయల్దేరింది. అలా... వారానికోసారి కరాచీ నుంచి మద్రాసుకు టాటా ఎయిర్‌ మెయిల్‌ కొనసాగింది.
అలా తొలుత ఉత్తరాలకు పరిమితమైన విమానంలో తర్వాత ప్రయాణికులను కూడా కూర్చోబెట్టడం మొదలెట్టారు. ఉత్తరాల బ్యాగులపైనే కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చేది. రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1939లో భారత్‌లో పౌరవిమానాలను రద్దు చేశారు. వీటన్నింటినీ బ్రిటిష్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. యుద్ధ అవసరాలకు వాడుకుంది. ఈ సమయంలోనే భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫ్యాక్టరీ ఆరంభించాలని టాటాలు యోచించారు. విన్సెంట్‌ మళ్లీ బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ యుద్ధసమయంలో (1942) ఆయన ప్రయాణిస్తున్న బాంబర్‌ విమానం మార్గమధ్యలోనే మాయమైంది. ఫ్రాన్స్‌ సమీపంలో విన్సెంట్‌ విమానాన్ని కూల్చేశారని తర్వాత తేలింది. టాటాలు తమ ప్రియ మిత్రుడికి బరువైన గుండెలతో వీడ్కోలు పలికి... ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లటంలో మునిగిపోయారు. భారత కీర్తి పతాకను గగనంలో ఎగరేశారు.

శభాష్‌ టాటా
విన్సెంట్‌ నైపుణ్యం... టాటాల క్రమశిక్షణ కారణంగా... తొలి ఏడాదిలోనే సమయపాలనలో నూటికి నూరుశాతం విజయం సాధించటం టాటా ఎయిర్‌మెయిల్‌ ఘనత. ‘‘ఎయిర్‌మెయిల్‌ సర్వీస్‌ను ఎలా నడపాలనే దానికి టాటాలు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్రిటిష్‌ ఇంపీరియల్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బందిని టాటాల వద్దకు కొద్దికాలం పంపించి శిక్షణ ఇప్పించాలి’’ అని 1933-34లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ తన నివేదికలో కితాబిచ్చింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని