Azadi Ka Amrit Mahotsav: యువ బాంబు పుట్టిన వేళ..!

జాతీయోద్యమంలో తిలక్‌ నుంచి బోస్‌ దాకా ఎంతో మంది విప్లవ యోధులు! వారందరిలో ప్రత్యేకమైన పేరు ఖుదీరాం బోస్‌.

Updated : 03 Dec 2021 05:59 IST

జాతీయోద్యమంలో తిలక్‌ నుంచి బోస్‌ దాకా ఎంతో మంది విప్లవ యోధులు! వారందరిలో ప్రత్యేకమైన పేరు ఖుదీరాం బోస్‌.

పుట్టిందే దేశం కోసమన్నట్లుగా... మీసాలు రాని వయసులోనే బ్రిటిష్‌ గుండెల్లో ‘బాంబు’లు పేల్చిన ధీరుడు... చిరునవ్వుతో ఉరి కొయ్యకు వేలాడిన దేశభక్తుడు... మనం మరచిన తొలి భగత్‌సింహుడు - ఖుదీరాం.

బెంగాల్‌లోని మేదినీపుర్‌ ప్రాంతంలో 1889 డిసెంబరు 3న ఖుదీరాం జన్మించేనాటికి ఆయన తండ్రి బ్రిటిష్‌ ప్రభుత్వంలో తహసీల్దార్‌! ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన కొడుకు. అప్పటికే ఇద్దరు కుమారులు పుట్టి చనిపోయారు. ఈ పిల్లవాడిని కాపాడుకోవటం కోసం స్థానిక సంప్రదాయాల ప్రకారం మూడు దోసిళ్ల బియ్యం (దీన్ని ఖుద్‌ అనేవారు) తీసుకొని పెద్దకూతురుకు అమ్మారు. అలా ఆ బాలుడి పేరు ఖుదీరాంగా స్థిరపడింది. కానీ దురదృష్టవశాత్తు ఆరో ఏటనే తల్లిని, ఏడో ఏట తండ్రిని కోల్పోవటంతో అక్కయ్య దగ్గరే తను పెరగాల్సి వచ్చింది. హామిల్టన్‌ హైస్కూల్లో చదువు. 1905లో బ్రిటిష్‌ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించటంతో ఆ ఉద్యమ ప్రభావం అందరిపైనా పడింది. అరబింద్‌ఘోష్‌, సిస్టర్‌ నివేదితలు తమ ప్రాంతానికి వచ్చి ఇచ్చిన ప్రసంగాలతో ఖుదీరాం ఉత్తేజితుడయ్యారు. 15వ ఏటనే... అరబిందో సారథ్యంలోని విప్లవసంస్థ అనుశీలన్‌ సమితిలో చేరారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచినందుకు అరెస్టు చేశారు కూడా. మీసాలు రాకుండానే చెరసాలకు వెళ్లి వచ్చిన ఖుదీరాం బాంబుల తయారీ నేర్చుకున్నారు.

ఆ సమయంలో కోల్‌కతాలో మేజిస్ట్రేట్‌గా పనిచేసిన డగ్లస్‌ కింగ్స్‌ఫోర్డ్‌... భారత స్వాతంత్య్ర సమరయోధుల పట్ల క్రూరంగా స్పందించేవాడు. కఠినమైన శిక్షలతో అణచివేసేవాడు. ఓసారి పోలీసుల దమనకాండను నిరసిస్తూ యువకులు కొందరు కోర్టు బయట ఆందోళన చేశారు. వారిలోని సుశీల్‌సేన్‌కు 15 కొరడా దెబ్బల శిక్ష విధించాడు కింగ్స్‌ఫోర్డ్‌. తోలు తేలిపోయేలా సుశీల్‌ను కొట్టారు. ప్రతి దెబ్బకూ వందేమాతరమంటూ నినదించాడు సుశీల్‌. ఇదంతా చూసిన విప్లవకారులు ఎలాగైనా కింగ్స్‌ఫోర్డ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. దీన్ని పసిగట్టిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ను ముజఫర్‌పుర్‌కు బదిలీ చేసింది. కానీ అనుశీలన్‌ సమితి వదల్లేదు.

ప్రఫుల్ల కుమార్‌ చాకి, ఖుదీరాం బోస్‌లు ముజఫర్‌పుర్‌ చేరుకున్నారు. అక్కడే ధర్మశాలలో ఉండి... కింగ్స్‌ఫోర్డ్‌ రాకపోకలు, ఆనుపానులపై ఆరాతీశారు. 1908 ఏప్రిల్‌ 29న రాత్రి 8.30కి... క్లబ్‌ నుంచి బయటకు రాగానే ఆయన బగ్గీపై బాంబువేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. అనుకున్నట్లే.. యూరోపియన్‌ క్లబ్‌ గేట్‌ దగ్గరకు బగ్గీ రాగానే... ఖుదీరాం ముందుకు దూకి బాంబు వేశాడు. భారీ విస్ఫోటనంతో బగ్గీ కాలిపోయింది. లక్ష్యం సాధించామనే సంతృప్తితో ప్రఫుల్ల, ఖుదీరాం చీకట్లో చెరోదారిన వెళ్లిపోయారు. బాంబు పేలింది... ఇద్దరు చనిపోయారు. కానీ కింగ్స్‌ఫోర్డ్‌ కాదు. క్లబ్‌లో బ్రిడ్జ్‌ ఆడటానికి వచ్చిన కింగ్స్‌ఫోర్డ్‌ కుటుంబ స్నేహితులైన ఇద్దరు మహిళలు (ఆంగ్లేయులే) ఆ బగ్గీలో ఉన్నారు. వీరివెనకాల మరో బగ్గీలో కింగ్స్‌ఫోర్డ్‌, ఆయన భార్య ఉన్నారు.

ఈ విషయం తెలియని ఖుదీరాం, ప్రఫుల్లలు రాత్రంతా ప్రయాణం చేస్తునే ఉన్నారు. రైలెక్కిన ప్రఫుల్ల బోగీలోని ఓ పోలీసుతో మాటల్లో దొరికిపోవటంతో... తన దగ్గరున్న పిస్తోల్‌తో పేల్చుకొని చనిపోయాడు. రాత్రంతా 25 కిలోమీటర్లు నడిచి ఉదయానికి వని అనే రైల్వే స్టేషన్‌ చేరుకున్న ఖుదీరాం కూడా అక్కడున్న పోలీసుల కంటపడ్డాడు. ఆయన వాలకం చూసి అనుమానం వచ్చి పట్టుకోవటంతో... జేబులోంచి రివాల్వర్‌ కింద పడింది. వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు. ప్రఫుల్ల చనిపోయిన విషయం తెలియని ఖుదీరాం... ఆయన్ను బతికించాలనే తపనతో తనపైనే నేరమంతా వేసుకొన్నాడు. జిల్లా కోర్టులో విచారణ అనంతరం మరణశిక్ష విధించారు. తీర్పు విన్నాక కూడా చిరునవ్వులు చిందిస్తున్న ఖుదీరాంను చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. తర్వాత హైకోర్టులో అప్పీలు చేయగా... అక్కడా మరణశిక్షే ఖరారైంది. 1908 ఆగస్టు 11న ధోతీకట్టుకొని... చేతిలో భగవద్గీత పట్టుకొని, ముఖంపై చిరునవ్వుతో రొమ్ము విరుచుకొని ఉరికంబమెక్కిన 18 ఏళ్ల 8 నెలల 8 రోజుల ఆ యువకుడి బలిదానాన్ని చూసి యావత్‌ కోల్‌కతా కదిలిపోయింది. అంతిమయాత్రలో వేలమంది పాల్గొన్నారు.

మరణానంతరం... ఖుదీరాం బెంగాల్‌కు ఓ ఫ్యాషనైపోయాడు. ఆయన ధరించిన ధోతీలాంటి వాటిని నేసిన బెంగాల్‌ చేనేత కార్మికులు...దానిపై ఖుదీరాం అని ముద్రవేసేవారు. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు.. జాతీయోద్యమంలో పాల్గొనే యువకులంతా ఈ ధోతీలనే ధరించేవారు. ఇప్పుడు బెంగాల్‌లో కొన్ని కాలేజీలతో పాటు ఓ రైల్వేస్టేషన్‌కు ఖుదీరాం పేరు పెట్టారు.

‘‘తీర్పు అర్థమైందా? నీకు పడ్డ శిక్ష ఏంటో తెలిసిందా?’’ అంటూ జడ్జి అడగ్గా... ‘‘తీర్పు అర్థం కావటమే కాదు... ఓ పదినిమిషాల సమయం ఇస్తే మీకు బాంబు చేయటం ఎలాగో కూడా నేర్పించటానికి నేను సిద్ధం’’ అంటూ నవ్వుతూనే ధైర్యంగా బదులిచ్చాడు ఖుదీరాం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని