Updated : 07 Dec 2021 05:17 IST

British Rule: నలుపైతే ఇక్కడ.. తెలుపైతే ఇంగ్లాండ్‌కు...

ఆంగ్లేయుల జాత్యహంకారం ఎక్కడిదాకా వెళ్లిందంటే వారి రక్తం పంచుకు పుట్టిన పిల్లలను కూడా ఈ తరాజులోనే బేరీజు వేసేంతగా! ఆంగ్లేయులు-భారతీయులకు పుట్టిన పిల్లల భవిత తెల్ల-నల్ల గీటురాయి ఆధారంగానే తేలేది. తెల్లగా పుడితే ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లేవారు... లేదంటే ఇక్కడే ఉంచేవారు.

ఈస్టిండియా కంపెనీ హయాంలో భారత్‌కు వచ్చిన అనేక మంది ఆంగ్లేయులు స్థానిక అమ్మాయిలను భార్యలుగా స్వీకరించేవారు. వీటిని చట్టబద్ధమైన పెళ్లిగా పరిగణించినవారు చాలా తక్కువ. కంపెనీ తరఫున పనిచేయటానికి భారత్‌ వచ్చారంటే చాలా సంవత్సరాల పాటు ఇక్కడే ఉండాల్సి వచ్చేది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక భారతీయ మహిళలను ఆంగ్లేయులు పెళ్లి చేసుకోవటాన్ని ఈస్టిండియా కంపెనీ ప్రోత్సహించింది. అంతేగాకుండా తమ బ్రిటిష్‌ ఉద్యోగికి-భారతీయ మహిళకు పుట్టిన పిల్లలు బాప్టిజం (క్రిస్టియానిటీ) స్వీకరించటానికి అంగీకరించిన తల్లులకు ఆర్థిక సహకారం అందిస్తామనీ ప్రకటించింది. ఈ మిశ్రమజాతి పిల్లల పెంపకానికి వచ్చేసరికి మాత్రం తెల్లవారికి తమ జాతి గుర్తుకు రావటం మొదలైంది. తమకు పుట్టిన పిల్లల విషయంలోనూ వివక్షను చూపటం ఆంగ్లేయులకే చెల్లింది. చిన్నారుల చర్మం, తల వెంట్రుకల రంగుల ఆధారంగా వారిని వర్గీకరించేవారు. అచ్చం ఆంగ్లేయుల్లా ఉన్నవారిని ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌కు పంపించేవారు. ఏ కొద్దిగా తెలుపు తక్కువున్నా, భారతీయ లక్షణాలు కన్పించినా వారిని ఇక్కడే ఉంచేవారు. ఇలా... ఒకే తల్లికి పుట్టిన పిల్లల్ని విడదీసేవారు. ఇలాంటి బంధాలను ఇష్టపడని ఆంగ్లేయులు  మిశ్రమ లక్షణాలతో జన్మించిన పిల్లల్ని కచ్చా-బచ్చా అని ఎగతాళి చేసేవారు. పక్కా శ్వేతజాతీయులు కాదని పదేపదే గుర్తు చేస్తూ వారిలో ఆత్మన్యూనత పెంచేవారు.

అవసరాల మేరకు ఆరంభించినా... ఈ బంధాలు, వాటి తదనంతర పరిణామాలతో ఇబ్బందులు తలెత్తటంతో పాటు, తమ జాతి సంకరం జరుగుతోందని ఆంగ్లేయుల్లో ఆందోళన పెరిగింది. తెల్లవారికి, భారతీయులకు మధ్య సంబంధాలను కట్టడి చేయటం మొదలైంది. ఈస్టిండియా హయాం ముగిసి... బ్రిటిష్‌ ప్రభుత్వ పాలన మొదలు కాగానే వీటిపై దాదాపు నిషేధం విధించారు.

ప్రత్యేక ఓడల్లో భారత్‌కు అమ్మాయిలు

భారత్‌లో పనిచేసే ఆంగ్ల యువకుల కోసం ఇంగ్లాండ్‌ నుంచి పెళ్లికాని అమ్మాయిలను ప్రత్యేకంగా ఓడల్లో రప్పించారు. ఈ ఓడలను ‘ఫిషింగ్‌ ఫ్లీట్స్‌’ అనేవారు. ఏడాది పాటు వీరిని భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో తిప్పి... వివాహ పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. తొలుత కోల్‌కతా, దిల్లీ, చెన్నై... తదితర ప్రధాన నగరాల్లోని బ్రిటిష్‌ క్లబ్బుల్లోని బాల్‌రూమ్స్‌లో తిప్పేవారు. అక్కడికి వచ్చే ఆంగ్ల అబ్బాయిలు, పురుషులను చూపించేవారు. వారికి వీరు...వీరికి వారు నచ్చితే పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోయేవారు. అక్కడ సంబంధం కుదరనివారిని... ద్వితీయశ్రేణి నగరాలు, అడవుల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆంగ్లేయులున్న చోటికి తీసుకెళ్లి మరో అవకాశం కల్పించేవారు. అలా తెల్లవారు తెల్లవారినే చేసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ అబ్బాయిలతో సంబంధం పెట్టుకోనిచ్చేవారు కాదు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని