British Rule: చావులోనూ వివక్షే!

ఆంగ్లేయుల దోపిడీ, దాష్టీకాల్ని భరించటమే కాదు... వారి సామ్రాజ్యవాద శత్రుత్వాల్లోనూ భాగమైంది భారత్‌! ఆంగ్లేయుల ఆధిపత్యం నిలబెట్టేందుకు దేశంకాని దేశంలో... శత్రువుగాని శత్రువుతో యుద్ధాలు చేసి... వేల మంది

Updated : 02 Dec 2021 05:14 IST

ఆంగ్లేయుల దోపిడీ, దాష్టీకాల్ని భరించటమే కాదు... వారి సామ్రాజ్యవాద శత్రుత్వాల్లోనూ భాగమైంది భారత్‌! ఆంగ్లేయుల ఆధిపత్యం నిలబెట్టేందుకు దేశంకాని దేశంలో... శత్రువుగాని శత్రువుతో యుద్ధాలు చేసి... వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. తమ విజయాల్లో కీలకపాత్ర పోషించినా బ్రిటన్‌ ప్రభుత్వం వారిపట్ల కనీస గౌరవం చూపించలేదు. సైన్యంలో భర్తీ నుంచి చావు దాకా వారిని అహంకారంతో అవమానించింది.

సామ్రాజ్యవాద కాంక్ష... ఐరోపాలో శత్రుత్వాలతో ప్రపంచ యుద్ధాల్లో దిగిన బ్రిటన్‌... తన తరఫున పోరాడేందుకు వలస రాజ్యాల్లోని వారిని దించింది. ఈ క్రమంలో వారికి బంగారు బాతులా కన్పించింది భారత్‌. 1914 నుంచి 1919 మధ్య 15 లక్షల మంది భారతీయులను మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ తరఫున పోరాడటానికి సైన్యంలో భర్తీ చేశారు. బ్రిటన్‌ పాలనలో ఉన్న మిగిలిన అన్ని దేశాలతో పోలిస్తే భారత భాగస్వామ్యమే ఎక్కువ. లక్షా 75వేల జంతువులను (గుర్రాలు తదితర) భారత్‌ నుంచి తీసుకెళ్లారు. భారత ఖజానా నుంచి దాదాపు 10 కోట్ల పౌండ్లను యుద్ధం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వానికిచ్చారు. కోట్ల విలువైన ఆహార ధాన్యాలు దీనికి అదనం.

యుద్ధ జాతులు...

భారతీయులను సైనికులుగా భర్తీ చేసుకోవటమే వివక్ష ఆధారంగా సాగేది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని వారిని సైన్యంలోకి ఆహ్వానించినా... ఉత్తర భారత్‌లోని వారికి అందులోనూ మళ్లీ పంజాబ్‌, బలూచిస్థాన్‌లాంటి ప్రాంతాల్లోని వారిని  యుద్ధజాతులుగా వర్గీకరించి ప్రాధాన్యం ఇచ్చేవారు. వీరితో పాటు గూర్ఖాలు, దోగ్రాలకు కూడా. కారణం... వీరంతా తమలా చలిప్రాంతాల్లోంచి వచ్చారు కాబట్టి యుద్ధాలను తట్టుకునే వీరత్వం ఉన్నవారని బ్రిటిష్‌ ప్రభుత్వం సిద్ధాంతీకరించింది. అదే సమయంలో భారతీయులకంటే బ్రిటిష్‌వారు సమర్థులైన యుద్ధవీరులని పదేపదే నూరిపోసేది. పని ఒకటే అయినా భారత సిపాయిలకు తెల్లవారికంటే తక్కువ జీతభత్యాలిచ్చేవారు. అంతేగాకుండా ర్యాంకులో తమకంటే ఎక్కువ హోదాగల భారతీయులకు ఆంగ్ల సైనికులు సెల్యూట్‌ చేసేవారు కాదు. యుద్ధ ప్రణాళికలు రచించే సమయంలో భారతీయులను ఉండనిచ్చేవారు కాదు.

ఇలా తీసుకు వెళ్లినవారిని యుద్ధంలో మోహరించటంలో కూడా తమ జాత్యహంకారాన్ని ప్రదర్శించటం తెల్లవారికే చెల్లింది. తొలుత భారతీయులను ఎక్కడా... తెల్లవారికి వ్యతిరేకంగానో, యూరోపియన్లకు వ్యతిరేకంగానో పోరాడటానికి దించేవారు కాదు. ఆఫ్రికాలో పోరాటాలకు వాడుకునేవారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తుపాకులెత్తటం అలవాటైతే... కొద్దిరోజుల తర్వాత తమపైనే వాటిని గురిపెడతారనే దురాలోచనతో భారతీయులను నల్లవారితోనే యుద్ధానికి దించేవారు. కానీ... బ్రిటిష్‌ సేనలు భారీగా ఎదురు దెబ్బలు తిన్నాక ఈ పద్ధతిని మార్చుకొని... ఫ్రాన్స్‌లో భారత సైనికులను మోహరించక తప్పలేదు.


గాయపడ్డా... మరణించినా...

యుద్ధంలో గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించేవారు. అక్కడ కూడా ఆంగ్లేయ నర్సులను భారతీయులకు సేవలు చేయనిచ్చేవారు కాదు. కారణం- వారెక్కడ వీరితో ప్రేమలో పడతారేమోననే భయం. తొలి ప్రపంచ యుద్ధంలో భారత్‌ నుంచి సుమారు 70వేల మంది యుద్ధంలో మరణించారు. తెల్లవారు మరణిస్తే... సమాధులను వారి వివరాలతో అందంగా అలంకరించే బ్రిటిష్‌వారు... భారతీయులు, నల్లవారిని మాత్రం పట్టించుకునేవారు కాదు. ‘‘హిందువులు, ముస్లింలకు ఆ అలంకరణలన్నీ అనవసరం. ఎందుకంటే వారికి వాటిపై పెద్దగా పట్టింపులేదు’’ అంటూ జనరల్‌ కాక్స్‌ అనే బ్రిటిష్‌ సైనికాధికారి సమర్థించుకోవడం వారి జాత్యహంకారానికి నిదర్శనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని