Omicron Variant: కట్టడికి కదులుదాం

‘ఒమిక్రాన్‌’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణ దిశగా కదిలిస్తోంది. వైరస్‌ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి.

Updated : 28 Nov 2021 05:23 IST

ఒమిక్రాన్‌ నియంత్రణకు ప్రపంచదేశాలు అప్రమత్తం
విమాన సర్వీసుల నిలిపివేత
యువత, టీకా తీసుకున్నవారు, ఇప్పటికే సోకిన వారికీ ముప్పు

దిల్లీ, బ్రసెల్స్‌, జొహానెస్‌బర్గ్‌: ‘ఒమిక్రాన్‌’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణ దిశగా కదిలిస్తోంది. వైరస్‌ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి. పరీక్షల్ని ముమ్మరం చేశాయి. కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. పలు ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయులు రావొద్దని బ్రిటన్‌తో పాటు, అమెరికా, రష్యా, జపాన్‌, ఆస్ట్రేలియాలు కూడా ప్రకటించాయి. విమాన సర్వీసుల్ని ఆపేస్తుండడంతో అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోతున్నారు. బ్రిటన్‌లో తొలిసారిగా శనివారం రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో అంగోలా, మొజాంబిక్‌, మలావీ, జాంబియాల నుంచి కూడా విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రకటించింది. జర్మనీలోనూ ఒకరు ఒమిక్రాన్‌ బారిన పడినట్టు అనుమానిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.1.529 వేరియంట్‌ బోట్స్‌వానా, బెల్జియం, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌లకు వ్యాపించింది.  అనేక ఉత్పరివర్తనాలు సంతరించుకున్న ఈ వేరియంట్‌ చాలా శక్తిమంతమైనదని... పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నవారికి, ఇప్పటికే ఒకసారి కొవిడ్‌ బారిన పడినవారికి కూడా ఇది సోకవచ్చని వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో నిలిచిపోయిన కుటుంబాలు

కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన క్రమంలో చాలా దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిలిపివేశాయి. ్టదీంతో పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సభ్యులను కలిసే నిమిత్తం దక్షిణాఫ్రికా వచ్చిన వందల మంది విదేశీయులు జొహానెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. కొన్నిదేశాలు తమ పౌరులు మాత్రమే అక్కడి నుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నాయి. భారత్‌ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోంది. కొవిడ్‌కు ముందు షెడ్యూలు అయిన ప్రయాణికుల విమానాల్లో సగం మాత్రమే దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌ నుంచి రాకపోకలు సాగించేలా అనుమతించాలని నిర్ణయించింది. డిసెంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ మూడింటిని ‘ఎట్‌-రిస్క్‌’ దేశాలుగా కేంద్ర ఆరోగ్యశాఖ వర్గీకరించింది.

లాక్‌డౌన్‌ దిశగా దక్షిణాఫ్రికా

తాజా పరిణామాల క్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా శనివారం అత్యవసరంగా ‘నేషనల్‌ కరోనా వైరస్‌ కమాండ్‌ కౌన్సిల్‌’ సమావేశం ఏర్పాటు చేశారు. ఒమిక్రాన్‌ తీవ్రత, వ్యాప్తి తీరు, రాకపోకలపై విదేశాలు ఆంక్షలు విధించడం తదితర అంశాలపై చర్చించారు. కొత్త వేరియంట్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించే అవకాశమున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ దేశాలు వరుసపెట్టి తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా తీవ్రంగా పరిగణించింది. ఇది తప్పుడు నిర్ణయమని, డబ్ల్యూహెచ్‌వో నియమావళికి విరుద్ధమని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జోఫాహ్లా వ్యాఖ్యానించారు. ప్రపంచ సమస్యను కలిసి పరిష్కరించాల్సిన తరుణంలో కొన్ని దేశాలు బలిపశువులను వెతుకుతున్నాయని పేర్కొన్నారు.

నెదర్లాండ్స్‌ చేరుకున్న వారిలో 61 మందికి పాజిటివ్‌!

దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్‌, కేప్‌టౌన్‌ విమానాశ్రయాల నుంచి రెండు విమానాల్లో నెదర్లాండ్స్‌ చేరుకున్న వారిలో 61 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ ఫలితం వచ్చింది! వారిని అధికారులు శనివారం క్వారంటైన్‌కు తరలించారు.

ఆగ్నేయాసియా దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

‘ఒమిక్రాన్‌’ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని, కొవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు పరచాలని, టీకా కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించాలని సూచించింది. జనం ఎక్కడా పెద్దసంఖ్యలో గుమిగూడకుండా, అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తల నడుమ వేడుకలు, పండుగలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ప్రాంతీయ డైరెక్టర్‌ డా.పూనమ్‌ ఖేత్రపాల్‌సింగ్‌ శనివారం పేర్కొన్నారు.

తగినన్ని పడకలను సిద్ధం చేసుకోవాలి

దక్షిణాఫ్రికాలో శుక్రవారం కొత్తగా 2,828 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్‌ వెలుగుచూసిన తర్వాత కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతుండగా.. ఈ వేరియంట్‌ యువతకే ఎక్కువగా సోకుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజా పరిస్థితిపై దక్షిణాఫ్రికాలోని సొవెటోస్‌లో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న బరగ్వానాథ్‌ ఆసుపత్రి ఐసీయూ హెడ్‌ రూడో మాథివా స్పందించారు. ‘‘20, 30 ఏళ్ల వయసువారే ఎక్కువగా ఒమిక్రాన్‌ బారిన పడుతున్నారు. వీరిలో మధ్యస్థాయి నుంచి తీవ్రస్థాయి లక్షణాలు ఉంటున్నాయి. కొందరికి ఐసీయూ అవసరమవుతోంది. బాధితుల్లో 65% మంది అసలు వ్యాక్సిన్‌ తీసుకోనివారే. మిగతా వారిలోనూ ఎక్కువమంది ఒక్కడోసు టీకా మాత్రమే తీసుకున్నారు’’ అని మాథివా పేర్కొన్నారు.


బెంగళూరులో కలకలం

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. అయితే వారికి సోకింది డెల్టా వేరియంట్‌ మాత్రమేనని పరీక్షల్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ఈనెల 1 నుంచి 26 వరకూ మొత్తం 584 మంది వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న పది దేశాల నుంచి బెంగళూరుకు వచ్చారు. వారిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 94 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది! ఏ వేరియంట్‌ సోకిందన్నది తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను ప్రయోగశాలకు పంపాం. డెల్టా వేరియంట్‌ కారణంగానే వారు కొవిడ్‌ బారిన పడినట్టు నిర్ధారణ అయింది’’ అని బెంగళూరు రూరల్‌ డిప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరూ క్వారంటైన్‌లోనే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని