Updated : 11/11/2020 06:20 IST

ఎన్‌డీఏ జోరు

అంచనాలకు మించి దూసుకెళ్లిన భాజపా
సాధారణ ఆధిక్యాన్ని సాధించిన కూటమి
ప్రభావం చూపిన మోదీ మంత్ర

అంచనాలు తల్లకిందులు చేస్తూ కమలం విరబూసింది. బిహార్‌తో పాటు తెలంగాణ దుబ్బాక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో భాజపా విజయ సుగంధాలు వెదజల్లింది. రాజకీయ పండితుల ఊహల్ని, ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల్ని పటాపంచలు చేసింది. నరాలు తెగే ఉత్కంఠకు తెరదించింది.

బిహార్‌లో నీతీశ్‌ కుమార్‌(జేడీయూ)తో జట్టుకట్టిన కమలదళం.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించింది. ఆ కూటమికి 125 స్థానాలు లభించగా, గట్టి పోటీనిచ్చిన మహా కూటమి 110 స్థానాల వద్ద ఆగిపోయింది. బిహార్‌ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ‘మోదీ మంత్ర’ చక్కగా పనిచేసింది. ముఖ్యంగా బిహార్‌ శాసనసభ సమరంలో సాధించిన విజయం ఆ పార్టీకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. కీలకమైన మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల్లోనూ కమలాన్నే విజయలక్ష్మి వరించింది. 28 స్థానాలకు గానూ 19 చోట్ల (ఆధిక్యం, గెలుపు కలిపి) కమలనాథులే దూసుకువెళ్లారు. గుజరాత్‌ ఉప ఎన్నికల్లో 8 స్థానాల్లోనూ భాజపా విజయాన్ని సాధించి బలాన్ని పరిపుష్టం చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు గానూ ఆరు.. భాజపా అభ్యర్థులకే దక్కాయి. ఉప ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. బిహార్‌లో వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో జేడీ(యూ) అభ్యర్థి విజయం సాధించారు.

దిల్లీ, పట్నా: ఎగ్జిట్‌ పోల్స్‌ ఏమాత్రం ఊహించని విధంగా బిహార్‌లో ఎన్డీయే కూటమి 125 సీట్లతో సాధారణ ఆధిక్యాన్ని సాధించింది. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు మించి ఈ కూటమిలో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. నీతీశ్‌ మార్క్‌ సుపరిపాలన, అభివృద్ధి పథకాల కొనసాగింపే లక్ష్యంగా ఎన్డీయే ఈ ఎన్నికల బరిలో నిలిచింది. మహా కూటమి ఎన్నో ఆశలు పెట్టుకున్నా చివరకు అధికారానికి కాస్త దూరంలో ఆగిపోయింది. ఒక దశలో ఎన్నికల ఫలితాలు సంకీర్ణ సర్కారుకు దారితీస్తాయా అనే సందేహానికి తెరతీశాయి. పార్టీల పరంగా ఆర్జేడీ అతి పెద్దదిగా నిలిచింది.

ఇవన్నీ కలిసి వచ్చాయి...
మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి హామీ పని దినాల పెంపు వంటి హామీలు అధికార కూటమి విజయానికి కారణమయ్యాయి. నీతీశ్‌ పాలన కన్నా మోదీ ప్రచార ప్రభావమే బాగా పనిచేసినట్లు భావిస్తున్నారు. జేడీయూ కంటే భాజపా అధిక స్థానాల్లో గెలుపొందడమే ఇందుకు నిదర్శనం. ఆర్జేడీపై మోదీ చేసిన అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. బిహార్‌లో కీలకమైన దళితులు, ముస్లింలు, యాదవులపై గురిపెట్టడం ఎన్డీయేకు కలిసివచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామనే హామీ చాలావరకు పనిచేసిందనే చెప్పాలి. నీతీశ్‌ కుమార్‌ విషయంలో భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడుతూనే.. పార్టీని బలోపేతం చేసుకోవడంపైనా దృష్టి సారించింది. జేడీయూ పట్ల ఉన్న అసంతృప్తి తమకు ఇబ్బంది తీసుకురాకుండా జాగ్రత్తపడింది. ఎల్జేపీ విడిగా పోటీచేసి ఓట్లు చీల్చడం కూడా భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు దోహదపడింది. ఎన్డీయే నుంచి వైదొలగాలనే చిరాగ్‌ పాస్వాన్‌ నిర్ణయం వెనుక భాజపా పెద్దలు ఉన్నారనే వార్తలు ముందు నుంచీ వినిపించాయి. వ్యూహం ఎవరిదైనా, రాష్ట్ర రాజకీయాలను భాజపా కీలక మలుపు తిప్పిందన్నది మాత్రం వాస్తవం.

బిహార్‌ ఫలితం హస్తం పార్టీని తీవ్రంగా నిరాశపరిచింది. మహా కూటమిలో నాయకత్వలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. రాహుల్‌ గాంధీ ఎనిమిది సభలకు హాజరైనా.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యువనేత ప్రియాంకా గాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు.  పార్టీ ప్రధాన వ్యూహకర్త అయిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఎన్నికల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సరైన నాయకత్వం లేకుండా సాగిన ప్రచార సరళి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించింది. ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొంటుంటే తేజస్వీ యాదవ్‌ మినహా వారిని దీటుగా ఎదుర్కొనే సరైన నాయకుడు మహా కూటమిలో కనిపించలేదు. ఈసారి ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులు దాదాపు 16 స్థానాల్లో నెగ్గడం విశేషం. అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం పార్టీ బిహార్‌లో అనూహ్య ఫలితాలు రాబట్టింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సీమాంచల్‌ ప్రాంతంలో ఆ పార్టీ తన ఉనికి చాటుకుంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని