Updated : 11/12/2020 11:34 IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి

హైకోర్టు అంగీకారం
ఆధార్‌, కులం వివరాలు అడగబోమని సర్కారు హామీ

ఈనాడు, హైదరాబాద్‌: కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (కార్డ్‌) ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు చేయడానికి అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు గురువారం హైకోర్టు అంగీకరించింది. గతంలోలా ఎలాంటి వివరాలు అడగకుండా రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటే అభ్యంతరం లేదంది. ఇందుకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకుని, ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్‌) సమర్పిస్తే ఆన్‌లైన్‌లోగానీ, భౌతికంగా కానీ రిజిస్ట్రేషన్‌ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.  కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్‌ నంబర్లు, కులం, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించబోమని కోర్టుకు హామీ ఇచ్చింది.

ఎలాంటి చట్టం లేకుండా ధరణి నమోదుతో పాటు కులం, ఆధార్‌ వివరాలు అడగటాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు కె.సాకేత్‌, ఐ.గోపాల్‌శర్మ మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు మరికొన్ని మధ్యంతర పిటిషన్‌లు దాఖలు చేశారని, అందువల్ల కౌంటర్లు దాఖలు చేయడానికి మరికొంత గడువివ్వాలని కోరారు. కొన్ని ఇతర అత్యవసర అంశాలున్నాయని, కరోనా వ్యాప్తి, ధరణి వంటి కొత్త వేదిక తీసుకురావడం తదితరాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌లకు వెళ్లలేకపోతోందని, అందువల్ల గత ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ తాము స్టే ఇవ్వలేదని, రిజిస్ట్రేషన్‌ చేయవద్దని చెప్పలేదని, పాత పద్ధతిలో చేసుకోవచ్చని కూడా సూచించామంది. ఈ దశలో గోపాల్‌శర్మ తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ గత పద్ధతిలో ఆన్‌లైన్‌ లేదా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లి చేసుకునేవారని, ప్రస్తుతం మొత్తం ఆన్‌లైన్‌లోనే అంటున్నారన్నారు. గతంలో పీటీఐఎన్‌ అడిగేవారు కాదని, రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 70, నిబంధనలు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. రిజిస్ట్రేషన్‌లను వారే గత సెప్టెంబరులో నిలిపివేశారని, పాత పద్ధతిలో ఎలాంటి పరిమితులు లేకుండా చేయబోమని ఆదేశించాలని కోరారు. దీనిపై ఏజీ స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయాలని ప్రభుత్వం ఎన్నడూ ప్రయత్నించలేదని, గతంలో ఉన్న విధానంలోనే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ సౌకర్యం లేనివారి పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా రిజిస్ట్రేషన్‌ శాఖ సహకారం అందిస్తుందని.. అయితే స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరని ఏజీ తెలిపారు. ధరణి పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ చేయడంలేదని స్పష్టం చేశారు. వాదనలను విన్న ధర్మాసనం ఏజీ హామీని నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్‌ చట్టం సెక్షన్‌ 70ఎ, 70బి, 70సిలు, నిబంధనలు 221 నుంచి 237 వరకు పేర్కొన్న విధానంలో రిజిస్ట్రేషన్‌కు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఇతర మధ్యంతర పిటిషన్‌లపై ఈనెల 14లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.

స్లాట్‌ బుకింగ్‌పై నిషేధం లేదు
రిజిస్ట్రేషన్‌ నిమిత్తం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్లాట్‌ బుకింగ్‌పై చట్టప్రకారం ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఒకేసారి వెయ్యి మంది వస్తే ఇబ్బందులుంటాయని, క్రమపద్ధతిలో ఉంచడానికే స్లాట్‌ పద్ధతి ఉపయోగపడుతుందని తెలిపింది. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఇబ్బందులున్నా, కంప్యూటర్‌ వ్యవస్థ పాడైనా నిబంధనల్లోనే ప్రత్యామ్నాయం ఉందని పేర్కొంది. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నాక కేటాయించిన సమయంలో రిజిస్ట్రేషన్‌కు రావచ్చని, ఒకవేళ పీటీఐఎన్‌ నంబరు లేకపోతే రెండు రోజుల్లో కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.


వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు పచ్చజెండా
నేటి నుంచి పాత విధానంలోనే స్లాట్‌ నమోదు
14 నుంచి రిజిస్ట్రేషన్లు
సీఎం ఆదేశంతో ఏర్పాట్లు చేసిన రిజిస్ట్రేషన్‌ శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్వపు విధానంలో (కార్డ్‌) స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్‌ నమోదు ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్లు మాత్రం 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ధరణి పోర్టల్‌ వేదికగా జరపాలనే తలంపుతో రాష్ట్రంలో సెప్టెంబరు 8వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ధరణి పోర్టల్‌ ద్వారానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌లు జరిగేలా పురపాలక, జీహెచ్‌ఎంసీ, గ్రామపంచాయతీలకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఉన్న ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్‌లో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ధరణిలో ఆధార్‌ వంటి వివరాల నమోదుపై అభ్యంతరాలు వ్యక్తంకావడం, కోర్టు కేసుల నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకాలేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లను శుక్రవారం నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గురువారం సాయంత్రం స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో ఈ విషయమై చర్చించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో స్లాట్‌ నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ‘శుక్రవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీచేశాం. రిజిస్ట్రేషన్లు 14 నుంచి ఆరంభిస్తాం. దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు లేదా మార్గదర్శకాలు జారీఅవుతాయి. ఆ ప్రకారం ప్రక్రియను కొనసాగిస్తాం’ అని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.

నిర్ణయాలివీ
* 11 నుంచి స్లాట్‌ నమోదు చేసుకోవచ్చు.
* పూర్తి రుసుం చెల్లించిన వారికే ఈ అవకాశం ఉంటుంది.
* 14 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.
* ఇకపై ముందస్తుగా వెబ్‌సైట్‌లో స్లాట్‌ నమోదు చేసుకుంటేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని