రాష్ట్రంలో 50 వేల మందికి శిక్షణ

రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు దాదాపు 50 వేల మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. గత వారమే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తికాగా రెండు రోజులుగా జిల్లాల్లోనూ శిక్షణను నిర్వహిస్తున్నారు. వచ్చే 7-10 రోజుల్లోగా ప్రాథమిక

Published : 16 Dec 2020 04:08 IST

  జిల్లాకో కొవిడ్‌ టీకా నిల్వ కేంద్రం
  అవసరాల మేరకు స్థానికంగా నియామకాలు
 ఒకేరోజు వైద్యసిబ్బందికి టీకాలిచ్చేలా ఏర్పాట్లు
  ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు దాదాపు 50 వేల మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. గత వారమే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తికాగా రెండు రోజులుగా జిల్లాల్లోనూ శిక్షణను నిర్వహిస్తున్నారు. వచ్చే 7-10 రోజుల్లోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిల్లోనూ వైద్య సిబ్బందికి శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొని వైద్యసిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పది వేల కేంద్రాల్లో టీకాలు
రాష్ట్రంలో తొలివిడతలో సుమారు 75 లక్షల మందికి కొవిడ్‌ టీకా అందజేసే అవకాశం ఉంది. ఇందులో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యసిబ్బంది ఉంటారు. సుమారు 2 లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బందికీ టీకాలిస్తారు. మిగిలిన వారిలో దాదాపు 60 లక్షల మందికి పైగా 50ఏళ్లు పైబడిన వారు ఉంటారని అంచనా. వీరు కాకుండా 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారికీ టీకా అందజేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యసిబ్బంది సమాచారం ఇప్పటికే కొవిన్‌ యాప్‌లో పొందుపర్చగా.. ఇతర కేటగిరీల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. దీంతోపాటు స్వచ్ఛందంగా కూడా ఆయా కేటగిరీల వ్యక్తులు టీకా కోసం కొవిన్‌ యాప్‌లో సమాచారాన్ని పొందుపర్చేందుకు అవకాశం కల్పిస్తారు. టీకాలు రాష్ట్రానికి చేరగానే.. తొలుత ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారు. వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు టీకాలివ్వాలని ప్రణాళిక రూపొందించారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కూడా ప్రభుత్వ బృందాల ఆధ్వర్యంలోనే టీకాలిస్తారు. కొవిడ్‌ టీకా వేయడానికి మొత్తం 10 వేల బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందం ఒక్కో కొవిడ్‌ కేంద్రంలో టీకాలను అందజేస్తుంది. ఇందుకోసం 10వేల మంది ఏఎన్‌ఎంలకు, 25వేల మంది ఆశా ఆరోగ్య కార్యకర్తలకు, 15వేల మంది వైద్యులు, నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోగా శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, టీకాలు అందించడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని వైద్యకార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.

టీకాల నిల్వకు ప్రత్యేక ఏర్పాట్లు

ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో టీకాల నిల్వ కేంద్రాలుండగా వీటితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కొవిడ్‌ టీకాలను భద్రపర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల టీకాలను, జిల్లాల్లో కోటి టీకాలను ఏకకాలంలో భద్రపర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. టీకాలను సరఫరా చేసేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టీకాల సరఫరాకు 16 వాహనాలు అందుబాటులో ఉండగా మరో 17 వాహనాలను కొనుగోలు చేయడానికి ఆదేశాలిచ్చారు. సమాచారాన్ని పొందుపర్చడంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మానవ వనరులను స్థానికంగానే నియమించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న టీకా నిల్వ పరికరాల్లో ఇబ్బందులుంటే సత్వరమే మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాల వైద్యాధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని