Published : 23/12/2020 04:56 IST

బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఇద్దరిలో కొవిడ్‌

కొత్త తరహా వైరస్‌ నిర్ధారణకు పుణెకు నమూనాలు
గత రెండు వారాల్లో బ్రిటన్‌ నుంచి 1500 మంది రాక
వీరందరికీ పరీక్షలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు-హైదరాబాద్‌: కొత్త రకం కరోనా వైరస్‌ బ్రిటన్‌ సహా వివిధ దేశాల్లో ప్రబలుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన సత్వర నివారణ చర్యలకు ఉపక్రమించింది. గత నెల రోజుల్లో యూకే నుంచి నేరుగా లేదా ఆ దేశం మీదుగా రాష్ట్రానికి చేరుకున్న ప్రయాణికులు సుమారు 3 వేల మంది ఉన్నారని ఆరోగ్యశాఖ ప్రాథమికంగా గుర్తించింది. వీరిలో గత 2 వారాల్లో వచ్చినవారి సంఖ్య 1500కు పైనే ఉంది. ఇందులో నేరుగా యూకే నుంచే తెలంగాణకు వచ్చిన ప్రయాణికులు 355 మంది ఉన్నట్లు తేల్చారు. వీరిలో కొందరికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో కొత్త వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నాయా? లేదా? అనేది గుర్తించేందుకు నమూనాలను పుణె వైరాలజీ ప్రయోగశాలకు పంపించారు. ఫలితాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు మంగళవారం తెలిపాయి. ‘‘రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎవరిలోనూ కొత్త రకం కరోనా వైరస్‌ నిర్ధారణ కాలేదు. ప్రజలు ఎటువంటి ఆందోళనకూ గురికావద్దు’’ అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. యూకే నుంచి సోమవారం వచ్చిన ఏడుగురు ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్‌ నెగిటివ్‌గా తేలిందని వెల్లడించారు.

సర్కారు క్వారంటైన్‌లోనే..
కొత్త కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో.. అత్యవసర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, ఇతర వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో కరోనా పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇవీ నిర్ణయాలు
* గత నెల రోజుల్లో యూకే నుంచి నేరుగా, లేక ఆ దేశం మీదుగా రాష్ట్రానికి వచ్చిన వారి ఆరోగ్యాన్ని నిత్యం వైద్యసిబ్బంది పర్యవేక్షించాలి. గత 2 వారాల్లో రాష్ట్రానికి వచ్చిన సుమారు 1500 మందికి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించాలి.
* వీరిలో ఎవరికైనా కొవిడ్‌ పాజిటివ్‌ వస్తే గచ్చిబౌలిలోని టిమ్స్‌లో చికిత్స అందించాలని నిర్ణయించారు. వీరి కుటుంబ సభ్యులను ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతారు. ఇందుకోసం 1000 పడకలను సిద్ధం చేశారు. వీరికి 5-7 రోజుల్లో మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు.
* ప్రయాణికులకు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినా 14 రోజుల పాటు వారి ఇంటి వద్దే క్వారంటైన్‌లో ఉండాలి. మొత్తం 28 రోజుల వరకూ పర్యవేక్షణ తప్పనిసరి.

మాస్కులు ధరించండి..  నిబంధనలు పాటించండి
‘‘యూకేలో గుర్తించిన కొత్త వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతమున్న కరోనా వైరస్‌ వ్యాప్తి 30 శాతం ఉంటే.. కొత్త రకం వైరస్‌ వ్యాప్తి 70 శాతం ఉన్నట్లు తేలింది. అయితే కొత్త కరోనా వైరస్‌తో మరణాల శాతం చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం’’ అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సూచించారు. కోఠిలోని ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం వీరు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా క్రిస్మస్‌ పండుగ, కొత్త సంవత్సర వేడుకల్లో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను పాటించాలని, మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అదుపులో ఉన్న వాతావరణాన్ని పాడుచేయొద్దని విన్నవించారు.

రాష్ట్రానికి 4-5 వారాల్లోనే కొవిడ్‌ టీకా
‘‘రాష్ట్రానికి 4-5 వారాల్లోనే కొవిడ్‌ టీకా రానుంది. టీకా రాష్ట్రానికి చేరగానే వెంటనే పంపిణీ చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయుల్లో శిక్షణ జరుగుతోంది. బుధవారంతో అన్ని స్థాయుల శిక్షణ పూర్తవుతుంది. 10 వేల మందికి పైగా టీకా ఇచ్చే సిబ్బందిని గుర్తించి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం’’ అని తెలిపారు.

 


అదుపు తప్పితే నియంత్రించడం కష్టం

కవేళ కొవిడ్‌ అదుపు తప్పితే తిరిగి నియంత్రణలోకి తీసుకురావడం కష్టసాధ్యమవుతుంది. తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొందరు ఉదాసీనంగా ఉంటున్నారు. ఎటువంటి లక్షణాలున్నా వెంటనే పరీక్షలు చేయించుకోండి. కొత్త రకం వైరస్‌ మన దేశంలోకి ప్రవేశించలేదు. ఆసుపత్రులన్నింటినీ అప్రమత్తం చేశాం. ఒకవేళ ఎవరిలోనైనా నిర్ధారించినా.. వారిని విడి గదుల్లో ఉంచి చికిత్స ఇచ్చేలా ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం ఇస్తున్న చికిత్సనే కొత్త వైరస్‌ బాధితులకూ ఇస్తారు. యూకే నుంచి వచ్చినవారందరూ విధిగా క్వారంటైన్‌లో ఉండాలి. మాస్కే అన్ని వైరస్‌ల నుంచి రక్షణ ఇస్తుంది.

- డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి


040-24651119 నంబరుకు కాల్‌ చేయండి

వంబరు 23 తర్వాత యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎవరిలోనైనా లక్షణాలు కనిపించినా, సందేహాలున్నా వెంటనే 040-24651119 నంబరుకు ఫోన్‌ చేయాలి. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పూర్తి అదుపులో ఉంది. ఆసుపత్రుల్లో చేరికలూ తగ్గిపోయాయి. క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకోండి. ముఖ్యంగా యువత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 60 సంవత్సరాల పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు.. వచ్చే 2 వారాల వరకూ దయచేసి బయటకు రావద్దు. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడాన్ని మానుకోండి.

- ప్రజారోగ్య సంచాలకులు డా. జి.శ్రీనివాసరావు

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని