కార్డుల డేటా కొల్లగొట్టారు

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ‘జస్‌పే’ నుంచి 10 కోట్ల మంది భారతీయుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు

Updated : 05 Jan 2021 04:45 IST

ప్రమాదంలో 10 కోట్ల ‘కార్డుల’ సమాచారం!
జస్‌పే సర్వర్ల నుంచి దొంగిలించిన సైబర్‌ నేరగాళ్లు
స్వతంత్ర దర్యాప్తు సంస్థ వెల్లడి

హైదరాబాద్‌: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ‘జస్‌పే’ నుంచి 10 కోట్ల మంది భారతీయుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు తస్కరించారని స్వతంత్ర దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఈ డేటాను, క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ రూపంలో పెద్ద మొత్తానికే డార్క్‌వెబ్‌కు అమ్ముకున్నట్లు ఆరోపించింది. టెలిగ్రామ్‌లో కూడా హ్యాకర్స్‌ ఈ డేటా సేకరించినట్లు తెలుస్తోంది. కార్డు ఫింగర్‌ ప్రింట్లు జనరేట్‌ చేసేందుకు హ్యాకర్లు హ్యాష్‌ అల్గారిథంను ఉపయోగిస్తే మాత్రమే దీన్ని డీక్రిప్ట్‌ చేయడం సాధ్యం అవుతుందని సైబర్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటర్నెట్‌ సెక్యూరిటీ రీసెర్చర్‌ రాజ్‌శేఖర్‌ రాజాహారియం అనే నిపుణుడు ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా చెల్లింపులను చేసిన అనేకమంది ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. వినియోగదారుల పేరు, మొబైల్‌ నంబరు, ఇ-మెయిల్‌ ఐడీ, బ్యాంకు పేరు, చెల్లింపులు, కార్డు రకం, కార్డు బ్రాండు (వీసా/మాస్టర్‌ కార్డు), కార్డు ముగింపు తేదీ, చివరి నాలుగు సంఖ్యలు, కార్డుదారుడి పేరు, వేలిముద్రలు.. ఇలా అన్ని వివరాలూ బహిర్గతం అయ్యాయని ఆ సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద డేటా లీక్‌గా దీన్ని పేర్కొంటున్నారు. పేమెంట్‌ కార్డు ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్‌ (పీసీఐ డీఎస్‌ఎస్‌) ప్రమాణాలు పాటించే జస్‌పే నుంచి ఈ సమాచారం బయటకు ఎలా వెళ్లిందనే విషయంలో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డేటా సురక్షితమే: జస్‌పే
‘గత ఏడాది ఆగస్టు 18న అనధికారికంగా మా సర్వర్లపై దాడి జరిగినా, వెంటనే నిరోధించాం. ఆ సమయంలో కార్డుదారులకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు వెళ్లలేదు. దాడి జరిగిన సమయంలో చాలా తక్కువమందికి సంబంధించిన సమాచారమే ఉంది. 10 కోట్ల మంది సమాచారం బయటకు వెళ్లిందనేది నిజం కాదు. కార్డుదారుల ఇ-మెయిల్‌, ఫోన్‌ నెంబర్లు మాత్రమే బయటకు వెళ్లాయి.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని