యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే

ఆరోగ్య రంగ సిబ్బంది, కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న ఇతర వర్గాలకు మాత్రమే తొలి విడత టీకాలను ఉద్దేశించాం. దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని నా వ్యక్తిగత సూచన. ప్రజా ప్రతినిధులమైన మనం దానిలో భాగం కాదు.

Updated : 12 Jan 2021 11:37 IST

తొలి విడతలో మూడు కోట్ల మందికి
సీఎంలతో సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి

మరోలా అర్థం చేసుకోవద్దు..
ఆరోగ్య రంగ సిబ్బంది, కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న ఇతర వర్గాలకు మాత్రమే తొలి విడత టీకాలను ఉద్దేశించాం. దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని నా వ్యక్తిగత సూచన. ప్రజా ప్రతినిధులమైన మనం దానిలో భాగం కాదు. 

- ప్రధాని మోదీ

దిల్లీ: దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది యోధులకు కరోనా టీకా ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ విడతలో ప్రజా ప్రతినిధులకు చోటు ఉండదని చెప్పారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సిన్‌ అందజేతపై చర్చించడానికి సోమవారం ఆయన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇప్పటివరకు 50 దేశాల్లో 2.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందితే మన దేశంలో జనవరి 16 నుంచి మొదలయ్యే కార్యక్రమంలో మూడు కోట్ల యోధులు సహా మొత్తం 30 కోట్ల మందికి అందబోతోందని ప్రధాని చెప్పారు. కొన్ని నెలల్లోనే ఇంతమందికి టీకా వేయడం ప్రపంచంలోనే అతిపెద్ద కసరత్తుగా నిలిచిపోతుందన్నారు.

దేశీయ తయారీ గర్వకారణం
‘‘మన దేశంలో ఇప్పటికే తయారైన రెండు కొవిడ్‌-19 టీకాలు ప్రపంచంలో ఇతర రకాల కంటే ఎంతో చౌక.  దేశీయ అవసరాల కోసం వీటిని అభివృద్ధి చేశారు. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేసిన కొవాగ్జిన్‌ టీకాలతో పాటు మరో నాలుగు త్వరలో రాబోతున్నాయి. వ్యాక్సిన్లు మొదలయ్యాక దేశంలో కరోనాపై పోరు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంటుంది. కసరత్తు రెండో దశకు చేరేనాటికి ఇంకొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పనితీరు గురించి తగినంత సమాచారం లేకుండానే వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామన్న విపక్ష నేతల ఆరోపణలు సబబు కాదు. పౌరులకు సమర్థమైన వ్యాక్సిన్లు అందేలా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. టీకాల విషయంలో శాస్త్రవేత్తలదే తుది నిర్ణయమని నేను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నాను. అత్యవసర అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారు కావడం గర్వకారణం. విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడాల్సి వస్తే మనకెంత కష్టమయ్యేదో ఊహించుకోవచ్చు’’ అని మోదీ చెప్పారు.

మన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది
టీకాలు వేయడంలో మన దేశానికి ఉన్న అనుభవం ఇప్పుడెంతో ఉపయోగపడుతుందని ప్రధాని అన్నారు. నిపుణులు, శాస్త్రవేత్తలు కలిసి రాష్ట్రాలతో మాట్లాడిన తర్వాతే టీకాలకు ప్రాధాన్యాలను నిర్ణయించామని వివరించారు. ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పారామిలిటరీ బలగాలు, హోంగార్డులు, విపత్తు నిర్వహణ సేవకులు, పౌర రక్షణ జవాన్లు, కంటెయిన్‌మెంట్‌/ నిఘాతో సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులు తొలి విడతలో వ్యాక్సిన్‌ పొందుతారని చెప్పారు. వీరంతా కలిసి మూడు కోట్ల వరకు ఉంటారన్నారు. ఎన్నికల్లో బూత్‌స్థాయి వ్యూహాన్ని అనుసరించిన రీతిలోనే ఇప్పుడు ముందుకు వెళ్తామని చెప్పారు. ఎవరికి టీకా వేయాలో గుర్తించి, పర్యవేక్షించడమే అత్యంత ముఖ్యాంశమన్నారు. ఆధార్‌ సాయంతో లబ్ధిదారుల్ని గుర్తించి, సకాలంలో వారికి రెండో మోతాదు అందేలా చూస్తామని చెప్పారు. మొదటి మోతాదు తీసుకున్నవారికి కొ-విన్‌ యాప్‌ద్వారా డిజిటల్‌ ధ్రువపత్రం అందుతుందని, రెండో మోతాదును అది గుర్తుచేసి, ఆ తర్వాత తుది ధ్రువీకరణను ఇస్తుందని తెలిపారు.
‘కరోనా విస్తృతి విషయంలో అనేక దేశాల కంటే మన దేశం మెరుగ్గా ఉండడం ఆనందదాయకమే. అయినా నిర్లక్ష్యం ఎంతమాత్రం పనికిరాదు. ఆరు నుంచి ఎనిమిది నెలల క్రితం ప్రజల్లో కనిపించిన భయాందోళన ఇప్పుడు లేదు. కరోనాపై పోరాడే విషయంలో ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం.. ఆర్థిక కార్యకలాపాలపైనా సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీకా ఇచ్చే కార్యక్రమంపై వదంతులు వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు జాగ్రత్త వహించాలి. వీటికి కళ్లెం వేయడంలో సామాజిక, మతపరమైన బృందాలను భాగస్వాముల్ని చేయాలి’ అని సూచించారు. రెండు రోజుల క్రితం తాను నిర్వహించిన సమీక్షలో రాష్ట్రాల నుంచి మంచి సలహాలు వచ్చాయని, కేంద్రం-రాష్ట్రాల మధ్య సహకారం.. సమాఖ్యతత్వానికి గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని