Updated : 13/01/2021 12:04 IST

వాషింగ్టన్‌లో ఆత్యయిక పరిస్థితి

ఆదేశాలు జారీచేసిన ట్రంప్‌
హింస చెలరేగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలోనే..
అభిశంసనపై నేడు ఓటింగ్‌

వాషింగ్టన్‌: అమెరికాలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. దేశ రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధించారు. ఈ నెల 24 వరకూ ఇది కొనసాగనుంది. తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆ సందర్భంగా తీవ్రస్థాయి అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో అధ్యక్షుడు ‘ఆత్యయిక’ నిర్ణయం తీసుకున్నట్టు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా.. ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతినిధుల సభ సోమవారం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్‌ జరుగనుంది.

ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ నిమిత్తం కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశమైన సందర్భంగా క్యాపిటల్‌ హిల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పంథాలోనే బైడెన్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆందోళనకారులు ఆయుధాలతో అల్లర్లకు దిగే ప్రమాదముందని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ), యూఎస్‌ నేషనల్‌ గార్డ్‌ బ్యూరో (ఎన్‌జీబీ)లు హెచ్చరించాయి. ఆత్యయిక పరిస్థితిని విధించిన వెంటనే 6 వేల అదనపు ట్రూపులను వాషింగ్టన్‌లో మోహరించినట్టు ఎన్‌జీబీ చీఫ్‌ జనరల్‌ డేనియెల్‌ హోకన్‌సన్‌ తెలిపారు.
 

నాకేం భయం లేదు: బైడెన్‌

తాజా పరిణామాల నేపథ్యంలో, తన ప్రమాణ స్వీకారంపై బైడెన్‌ స్పందించారు. క్యాపిటల్‌ హిల్‌ వెలుపల ప్రమాణ స్వీకారం చేసేందుకు తనకు ఎలాంటి భయం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ భవనంపై దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ తాత్కాలిక సెక్రటరీ చాద్‌ వోల్ఫ్‌ రాజీనామా చేశారు.
బైడెన్‌, హారిస్‌లకు హెచ్చరికలు
‘‘ప్రభుత్వ పరిపాలన భవనాల వద్ద విధ్వంసం సృష్టిద్దామంటూ ఈనెల 8న ఒక గ్రూపు నుంచి సందేశాలు వెళ్లాయి. 20వ తేదీన అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆందోళనలు చేపట్టాలని సదరు బృందం యోచించింది. బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌, ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీలకూ హెచ్చరికలు వస్తున్నాయి’’ అని ఎఫ్‌బీఐ బులెటిన్‌ విడుదల చేసింది. ట్రంప్‌ మద్దతుదారులు ఈనెల 20న మిలియన్‌ మిలీషియా మార్చ్‌ చేపట్టనున్నారని ద వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఆందోళనకారులు రాష్ట్రాల చట్టసభలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ద న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది.

ట్రంప్‌-పెన్స్‌ల మధ్య చల్లారిన కోపతాపాలు

అధ్యక్షుడు ట్రంప్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ల మధ్య కోపతాపాలు చల్లారినట్టే కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ, క్యాపిటల్‌ భవనంపై దాడి సమయంలో వారిద్దరూ పరస్పరం విభేదించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటల్లేవు. అయితే సోమవారం సాయంత్రం ట్రంప్‌-పెన్స్‌లు ఓవల్‌ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. ‘‘భేటీ సందర్భంగా వారి మధ్య మంచి సంభాషణ జరిగింది. బైడెన్‌ బాధ్యతలు చేపట్టేవరకూ కలిసి పనిచేద్దామని అనుకున్నారు’’ అని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ట్రంప్‌ తన పదవికి రాజీనామా చేయడంగానీ, పెన్స్‌ 25వ సవరణ అధికారాన్ని ఉపయోగించి అధ్యక్షుడిని తొలగించడంగానీ జరగదని విశ్లేషకులు భావిస్తున్నారు. 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు సుముఖంగా లేనట్టు పెన్స్‌ ఇప్పటికే సంకేతాలిచ్చారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని