Updated : 13/01/2021 12:06 IST

సాగు చట్టాలపై స్టే

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అమలు చేయొద్దు: సుప్రీంకోర్టు
జస్టిస్‌ బోబ్డే ధర్మాసనం ఆదేశం

నలుగురితో కమిటీ ఏర్పాటు
తీర్పును ఆహ్వానిస్తాం.. నిరసనలు కొనసాగిస్తాం: రైతు సంఘాలు

దేశ ప్రజల ప్రాణాల, ఆస్తుల పరిరక్షణ మాకు ముఖ్యం. అందుకే ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకుంటున్నాం. చట్టాన్ని సస్పెండ్‌ చేసే అధికారం మాకు ఉంది. సమస్యకు నిజంగా పరిష్కారాన్ని కోరుకుంటున్నవారు వ్యవసాయ చట్టాలపై కమిటీ వద్దకు వెళ్తారు. ఇది రాజకీయం కాదు. రాజకీయాలకు, న్యాయవ్యవస్థకు మధ్య తేడా ఉంది. అందువల్ల రైతు సంఘాలు సహకరించాలి.

 


శాంతియుత నిరసనల గొంతును నులిమేయలేం. ఆ నిరసనలకు ఫలితంగానే చట్టాల అమలుపై అసాధారణ స్టే ఇస్తున్నట్లు భావిస్తున్నాం. సభ్యులను రైతు సంఘాలు ఒప్పించి తమ తమ పనుల్లోకి తిరిగి వెళ్లేగా చూస్తారని    భావిస్తున్నాం. వారితో పాటు ఇతరుల ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ విధంగా చేస్తారనుకుంటున్నాం.

- సుప్రీం కోర్టు

దిల్లీ: వివాదాస్పదంగా నిలిచిన మూడు వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే వర్తిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ప్రకటించింది. కేంద్రం చేసిన మూడు చట్టాల రాజ్యాంగపరమైన చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తదుపరి విచారణ కొనసాగించింది. కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి నలుగురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది. ప్రతిష్టంభన తొలగించడానికి కమిటీని నియమించడంలో తమను ఏ శక్తీ నిలువరించజాలదంది. కమిటీకి రైతు సంఘాలు సహకారాన్ని అందించాలని కోరింది. సుప్రీంకోర్టు నియమించే ఏ కమిటీ వద్దకు వెళ్లేది లేదని రైతు సంఘాలు చెప్పిన విషయం తెలిసిందే. తీర్పును వెలువరించడానికి ముందుగా రైతు సంఘాల సహకారానికి ధర్మాసనం పిలుపునిచ్చింది. ఉద్యమాన్ని విరమించేది లేదని సంఘాలు ప్రకటించాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వెలువరించిన తీర్పు సందర్భంగా జస్టిస్‌ బోబ్డే ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. చట్టాలపై స్టే ఇవ్వవద్దంటూ కేంద్రం వినతిని తిరస్కరించింది. చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉంటుందని, దానిపై స్టే తగదని కేంద్రం వాదించింది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు తప్పిస్తే చట్టాలపై స్టే ఇవ్వరాదంది. కార్యనిర్వాహక చర్యపై స్టే విధించే అధికారం తమకుందని కోర్టు చెప్పింది.
కనీస మద్దతు ధర కొనసాగాలి
ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వ్యవస్థను తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. వ్యవసాయ చట్టాల ఫలితంగా తీసుకునే ఏ చర్యవల్లనైనా ఏ రైతుకూ భూమిపై ఉన్న హక్కును తోసిపుచ్చరాదని స్పష్టంచేసింది. ప్రభుత్వ వాదనతో పాటు రైతుల అభిప్రాయాలనూ కమిటీ తెలుసుకోవాలని, దిల్లీలో తొలి భేటీ జరిగినప్పటి నుంచి రెండు నెలల్లోగా సిఫార్సులతో నివేదిక సమర్పించాలని పేర్కొంది. మంగళవారం నుంచి 10 రోజుల్లోగా తొలి సమావేశం జరగాలంది. ఉభయ పక్షాలూ తమ తీర్పును సానుకూల స్ఫూర్తితో తీసుకుని సమస్యలపై సముచితమైన, సమానమైన, సహేతుకమైన పరిష్కారానికి వస్తాయని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తంచేసింది. గాయపడిన రైతుల హృదయాలకు తమ స్టేతో భరోసా లభించి, విశ్వాసంతో చర్చలకు వస్తారని భావిస్తున్నట్లు పేర్కొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా ఉద్యమిస్తున్నారంటూ రైతుల్ని కొనియాడింది.
ఖలిస్థానీలు చొరబడ్డారు: అటార్నీ జనరల్‌
నిషేధానికి గురైన ఒక సంస్థ.. రైతు ఉద్యమానికి మద్దతు ఇస్తోందని తమ ముందుకు వచ్చిన అంశం గురించి అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఉద్యమంలో ఖలిస్థానీలు చొరబడ్డారని వేణుగోపాల్‌ చెప్పారు. న్యాయస్థానం సూచన మేరకు బుధవారం దీనిపై నిఘావర్గాల సమాచారంతో కూడిన ప్రమాణపత్రం దాఖలు చేస్తానని ఆయన చెప్పారు. తదుపరి విచారణను ధర్మాసనం ఎనిమిది వారాలపాటు వాయిదా వేసింది. ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవానికి అవాంతరం కలిగించేలా ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలపై నిలుపుదల ఉత్తర్వు ఇవ్వాలని కేంద్రం విడిగా దాఖలు చేసిన దరఖాస్తుపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

ఉద్యమాన్ని విరమించేది లేదు: రైతు సంఘాలు

సుప్రీంకోర్టు తీర్పును రైతు సంఘాలు ఆహ్వానించాయి. అయితే వ్యవసాయ చట్టాలు రద్దయ్యేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని తెగేసి చెప్పాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత 40 సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌మోర్చా నేతలు సమావేశమై పరిస్థితిపై చర్చించారు. తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనేది దీనిలో చర్చించారు. న్యాయస్థానం నియమించిన కమిటీ ముందుకు వెళ్లేందుకు తాము సుముఖంగా లేమని, దీనిపై లాంఛనంగా ఒక నిర్ణయాన్ని మోర్చా తీసుకుంటుందని నేతలు తెలిపారు. చట్టాలను రద్దు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్‌ అని పునరుద్ఘాటించారు. కమిటీలపై తమకు విశ్వాసం లేదని, గతంలో ప్రభుత్వం చేసిన ప్రతిపాదననే ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిందని అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు లోక్‌వీర్‌సింగ్‌ పెదవి విరిచారు. ప్రస్తుత కమిటీ పనితీరును చూడాల్సి ఉందన్నారు. చట్టాలపై న్యాయస్థానం స్టే విధించిందే గానీ రద్దు చేయలేదని చెప్పారు.

సుప్రీం నియమించిన కమిటీ సభ్యులు వీరే...

భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు భూపీందర్‌సింగ్‌ మాన్‌, శేత్కరీ సంఘటన్‌ అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాట్‌, అంతర్జాతీయ ఆహార విధాన అధ్యయన సంస్థ డైరెక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ జోషి, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని