Updated : 17/01/2021 05:46 IST

ఆ ముగ్గుర్నీ తొలగించండి

సాగు చట్టాల కమిటీకి కొత్త వ్యక్తుల్ని నియమించండి
సుప్రీంకు బీకేయూ(లోక్‌శక్తి) వినతి

దిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీలోని ప్రస్తుత సభ్యులందరినీ తొలగించాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ)-లోక్‌శక్తి శనివారం సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. సాగు చట్టాలను సమర్థించిన నలుగురు వ్యక్తులను కమిటీ సభ్యులుగా నియమించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. అయితే, ఈ కమిటీ నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతున్నట్లు భూపీందర్‌ సింగ్‌ మాన్‌ ఇప్పటికే ప్రకటించారు. మిగిలిన ముగ్గురు సభ్యులు...డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషి, అశోక్‌ గులాటీ, అనిల్‌ ఘన్వాత్‌తో కూడిన కమిటీ ఈ నెల 19న తొలిసారిగా భేటీ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ కమిటీ నుంచి తొలగించాలని, తటస్థంగా ఉండే కొత్త సభ్యులను నియమించాలని బీకేయూ(లోక్‌శక్తి) విజ్ఞప్తి చేసింది. ఈ నెల 26న రాజ్‌పథ్‌లో  సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్వహించదలచిన ట్రాక్టర్ల కవాతుపై నిషేధాజ్ఞలు జారీ చేయాలని కోరుతూ దిల్లీ పోలీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని కూడా కోరింది. కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 18న విచారణ జరపనుంది. 41 రైతు సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్‌ మోర్చాలో బీకేయూ(లోక్‌శక్తి) కూడా ఒక భాగస్వామి.
దీక్షా శిబిరంలో 400 మంది కేరళ రైతులు
జైపుర్‌: సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తూ దీక్షా శిబిరాలను కొనసాగిస్తున్న కర్షకులకు 400 మంది కేరళ రైతులు సంఘీభావం తెలిపారు. కేరళ నుంచి షాజహాన్‌పుర్‌ వచ్చిన వీరు సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలోని ధర్నాలో పాల్గొన్నారు. రాజస్థాన్‌-హరియాణా సరిహద్దులోని ఇక్కడి రహదారిపై 3 కి.మీ. పొడవున రైతులు బైఠాయించారు.


చట్ట వ్యతిరేక కార్యకలాపాల కేసులో.. రైతు నేతలకు ఎన్‌ఐఏ సమన్లు

దిల్లీ: మూడేళ్ల క్రితం పంజాబ్‌లో నమోదైన హింస, విధ్వంస కేసులకు సంబంధించి రైతు ఉద్యమ నేతలు, పాత్రికేయులకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తాజాగా సమన్లు జారీ చేయడం వివాదానికి దారి తీసింది. సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జే) అనే సంస్థ సభ్యులు ప్రధాన నిందితులుగా ఉన్న ఈ కేసులో 12 మందికిపైగా రైతు నేతలను, పాత్రికేయులను ఎన్‌ఐఏ ప్రశ్నించనుంది. దక్షిణ దిల్లీలోని సంస్థ ప్రధాన కార్యాలయానికి ఈనెల 17, 18 తేదీల్లో రావాల్సిందిగా వారికి పంపిన తాఖీదుల్లో పేర్కొంది. అయితే, దర్యాప్తునకు ఉపయోగపడే వివరాలేమైనా లభిస్తాయనే ఉద్దేశంతోనే ఆయా కేసుల్లో సాక్షులుగా భావిస్తున్న వారిని విచారించదలచినట్లు ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు. సమన్లు అందుకున్న వారిలో లోక్‌ భలాయ్‌ ఇన్సాఫ్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు బల్‌దేవ్‌ సింగ్‌ ఉన్నారు. ఆయన సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో రైతు సంఘాల నేతలతో కలిసి పాల్గొంటున్నారు. సురేందర్‌ సింగ్‌ తిక్రివాల్‌, పల్విందర్‌ సింగ్‌, పర్‌దీప్‌ సింగ్‌, నోబెల్‌జిత్‌ సింగ్‌, కర్నైల్‌ సింగ్‌ తదితరులకు కూడా సమన్లు అందాయి. 2017-18లో పంజాబ్‌లో జరిగిన పలు హింస, విధ్వంస ఘటనలు, 2020లో ఎస్‌ఎఫ్‌జే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి సంబంధించి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఏపీఏ) కింద ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా డిసెంబరు 15న ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసింది. దీనిలో భాగంగా తాజాగా సమన్లు జారీ అయ్యాయి.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని