Published : 23/01/2021 03:52 IST

రెండోవరుస నమోదు ఎప్పుడు?

జాబితాలో చేరింది పోలీసు, పురపాలక సిబ్బందే
ఇంకా మొదలవని రెవెన్యూ సిబ్బంది ప్రక్రియ
25లోగా పూర్తికి కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సిబ్బందికి కొవిడ్‌ టీకాల పంపిణీ కొనసాగుతుండగా.. ఈనెల 25 నుంచి ప్రైవేటు వైద్యసిబ్బందికి అందించడానికి వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. వీరి తర్వాత వరుసలో నిలిచింది పురపాలక, రెవెన్యూ సిబ్బంది. అయితే ఇప్పటి వరకూ ఈ విభాగాలకు చెందినవారి వివరాలను కొవిన్‌ యాప్‌లో పొందుపరిచే ప్రక్రియ పూర్తికాలేదు. వీరితో పాటు పంచాయతీరాజ్‌ శాఖలో గ్రామీణ పారిశుద్ధ్య సేవల్లో పాల్గొంటున్న సిబ్బందికి కూడా టీకాలను అందజేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ విభాగంలో సుమారు 3 లక్షలమంది ఉంటారని అంచనా. అలాగే పోలీసు శాఖ నుంచి సుమారు లక్ష.. పురపాలక శాఖ నుంచి 45 వేలు.. పంచాయతీరాజ్‌ శాఖ నుంచి సుమారు 15 వేల సిబ్బందిని జాబితాలో చేర్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికి 1.60 లక్షలమందిని మాత్రమే పొందుపరచడంతో.. మిగిలిన వారి సమాచారాన్ని ఇంకా ఎప్పుడు ఆన్‌లైన్‌లో చేర్చుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ సిబ్బంది పేర్లు చేర్చే ప్రక్రియ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. వచ్చే నెల రెండోవారంలో వీరికి టీకాలను అందించాలని వైద్యఆరోగ్యశాఖ భావిస్తోంది. జాబితా సిద్ధం కాకపోతే.. కేంద్రాన్ని ఎన్ని టీకాలు పంపాలో అడగడం ఎలా? అని వైద్యవర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఈ సమస్యను వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన అత్యవసరంగా ఉత్తర్వులు జారీచేశారు. రెవెన్యూ సిబ్బంది వివరాలను ఈనెల 25 లోగా యాప్‌లో చేర్చాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
పొందనివారి కోసం ఒకరోజు
ప్రస్తుత టీకాల పంపిణీలో గైర్హాజరైన సిబ్బందికి ఈనెల 25న ప్రత్యేకంగా అందజేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. కొవిన్‌ యాప్‌లో ‘తిరస్కరణ’కు జరిగిన సిబ్బంది మినహా ఇతరత్రా కారణాల వల్ల హాజరు కాని సిబ్బందికి ఈ అవకాశం ఇవ్వనున్నారు. తొలి రెండు కేటగిరీలకు టీకాల పంపిణీ పూర్తయ్యాక మార్చి నుంచి 50 ఏళ్ల పైబడినవారికి, ఆలోపు వయసులో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకాలను అందజేయనున్నారు. అప్పుడు పంపిణీ కేంద్రాల సంఖ్యను క్రమేణా పెంచుతామని వైద్యవర్గాలు తెలిపాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని