Updated : 11/02/2021 04:40 IST

హైదరాబాద్‌లో ఎన్‌కామ్‌

దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు
సమగ్ర నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు
భాగస్వామిగా చేరనున్న ‘జాతీయ సంకలిత తయారీ సంఘం’

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే తొలి జాతీయ సంకలిత తయారీ కేంద్రం(నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎన్‌కామ్‌) హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమమేధ, రోబోటిక్‌, యంత్ర పరిజ్ఞానం వంటి నవీన సాంకేతికతలతో త్రీడీ ప్రింటింగ్‌, కంప్యూటర్‌ ఆధారిత ఆకృతి(క్యాడ్‌), సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సాయంతో పరిశ్రమలకు అవసరమైన ప్రాజెక్టులు, పరికరాలు, విడిభాగాల నమూనాలను రూపొందించి అందించడం వంటి కార్యకలాపాలను ఇందులో నిర్వహించనున్నారు. వాటిపై పరిశోధనలు, అభివృద్ధి, అకృతుల తయారీలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు, నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ‘జాతీయ సంకలిత తయారీ సంఘాన్ని’ ఇందులో భాగస్వామిగా చేర్చాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్‌కామ్‌ కేంద్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది.  ఇవి త్రీడీ తదితర నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భారీ పరిశ్రమలతోపాటు సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా యంత్ర పరికరాల నమూనాలు, పరికరాలు రూపొందించి ఇస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమల నవీకరణకూ ఊతమిస్తున్నాయి. భారత్‌లోనూ ఈ తరహా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జాతీయ సంకలిత తయారీ ముసాయిదా’ విధానాన్ని ప్రకటించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయస్థాయి కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. తొలి కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధమైన రాష్ట్రం ఒక్కటేకావడం, ఐటీ రంగంలో ఇప్పటికే గుర్తింపు ఉండటంతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఆమోదిస్తే మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరడంతోపాటు జాతీయస్థాయి సంస్థగా గుర్తింపు లభిస్తుంది. కేంద్రం ఆమోదించని పక్షంలో సొంతంగా దీనిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పరిశ్రమలతోపాటు వాహనాల తయారీ, వైమానిక, రక్షణ, ఆరోగ్య పరిరక్షణ, దుస్తుల తయారీ, నిర్మాణ, వినియోగవస్తు పరికరాల రంగాల అభ్యున్నతికి దీన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది.

ఇదీ ప్రణాళిక
* ప్రస్తుతం తెలంగాణలో టీహబ్‌, వీహబ్‌, టీవర్క్స్‌, జీఎస్‌ఐలీ, రిచ్‌ వంటి సంస్థల ద్వారా నవీన అంకుర ఆలోచనలు, ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అదే తరహాలో సంకలిత కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
* దీని ఏర్పాటులో వివిధ దేశాల్లో నడుస్తున్న కేంద్రాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
* పరిశ్రమలు, విద్యాసంస్థలను అనుసంధానం చేసి, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల విద్యార్థులకు ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. వినియోగదారుల అవసరాల మేరకు పరికరాల రూపకల్పన, మార్కెటింగ్‌పైనా పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
* ఇందులో భాగంగా తెలంగాణ ఐటీశాఖ నవీన సాంకేతికతల విభాగం ఈ నెల 6వతేదీన దృశ్యమాధ్యమ సదస్సు నిర్వహించి, దేశవ్యాప్తంగా ఈ రంగానికి చెందిన పరిశ్రమలు, అంకురాలు, విద్యావేత్తల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దాన్ని రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

ప్రపంచస్థాయి కేంద్రంగా మారుతుంది
- జయేశ్‌రంజన్‌, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి

ప్రస్తుతం ఎన్‌కామ్‌లకు ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆవిష్కరణలు, పరిశోధన కేంద్రంగా దీన్ని ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతం ఈ రంగంలోని పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో జాతీయ స్థాయి కేంద్రంతో పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలా మేలు జరుగుతుంది. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధిని, జాతీయ లక్ష్యాలను సాధిస్తుంది. దేశీయ మార్కెట్‌ అవసరాలను తీరుస్తుంది. ఎగుమతులకూ అవకాశం ఉంటుంది. భారీఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని