ఏపీలో ఇక పురపోరు

ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వస్తున్న సమయంలో రాష్ట్రంలో మరో ఎన్నికల పోరుకు తెరలేచింది. పల్లెపోరు పూర్తయ్యేసరికి పట్టణాల్లో ఎన్నికల

Published : 16 Feb 2021 03:30 IST

మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
గతేడాది ఎక్కడ ఆగాయో అక్కణ్నుంచే ప్రక్రియ మొదలు

ఈనాడు, అమరావతి: ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వస్తున్న సమయంలో రాష్ట్రంలో మరో ఎన్నికల పోరుకు తెరలేచింది. పల్లెపోరు పూర్తయ్యేసరికి పట్టణాల్లో ఎన్నికల సందడి జోరందుకోనుంది. కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో వాయిదా పడిన పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికల పోలింగును వచ్చే నెల 10న నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే మళ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అందులో పేర్కొంది. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై 14న ఓట్ల లెక్కింపుతో పూర్తవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గతంలో ఒకరోజు ఇచ్చిన గడువును ఈసారి రెండు రోజులకు పెంచారు. మహా విశాఖ నగరపాలక సంస్థ, విజయవాడ నగరపాలక సంస్థ లకు వేర్వేరుగా, మిగతా 8 నగరపాలక సంస్థలకు కలిపి ఒకటి, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు కలిపి మరొకటి చొప్పున మొత్తం నాలుగు నోటిఫికేషన్లు ఎన్నికల సంఘం జారీ చేసింది.
ఎన్నికలు నిర్వహించని నగరపాలక సంస్థలు: కోర్టు కేసుల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరుల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. కాకినాడలో ఇప్పటికే పాలకవర్గం ఉన్నందున నోటిఫికేషన్‌ జారీ చేయలేదు.
ఎన్నికలు నిర్వహించని పురపాలక, నగర పంచాయతీలు: కోర్టు కేసులు, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో రాజాం, ఆమదాలవలస, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆకివీడు, భీమవరం, గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, గురజాల, దాచేపల్లి, దర్శి, కందుకూరు, కావలి, గూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, బేతంచెర్ల, శ్రీకాళహస్తి, కుప్పం, రాజంపేట, కమలాపురం, పామిడి,   పెనుకొండల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని