Vaccine: మోడెర్నా వ్యాక్సిన్‌ వస్తోంది

భారత్‌లో త్వరలోనే మరో కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ‘మోడెర్నా’ వ్యాక్సిన్‌ రాకకు మార్గం సుగమమైనట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు.

Updated : 30 Jun 2021 12:09 IST

భారత్‌లో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

ఈనాడు, దిల్లీ: భారత్‌లో త్వరలోనే మరో కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ‘మోడెర్నా’ వ్యాక్సిన్‌ రాకకు మార్గం సుగమమైనట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు. అత్యవసర వినియోగం కోసం భారతీయ అనుబంధ సంస్థ సిప్లా ద్వారా మోడెర్నా చేసుకున్న దరఖాస్తుకు ఔషధ నియంత్రణ సంస్థ- డీసీజీఐ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. దిల్లీలో ఆయన మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాజా అనుమతితో.. సిప్లా ద్వారా మోడెర్నా వ్యాక్సిన్‌ను భారత్‌కు దిగుమతి చేసుకోవడానికి అవకాశం లభించిందన్నారు. దీంతో దేశంలో వినియోగానికి అందుబాటులోకి వచ్చిన టీకాల సంఖ్య నాలుగుకు పెరిగిందన్నారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-విలను ఇప్పటికే ఉపయోగిస్తున్న సంగతిని గుర్తుచేశారు. ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లనూ భారత్‌కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మోడెర్నా వ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా ఉపయోగించడానికి అనుమతి ఇచ్చారా? లేదంటే అమెరికా విరాళంగా ఇస్తోందా? అన్న ప్రశ్నకు పాల్‌ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘‘ప్రస్తుతం డీసీజీఐ నుంచి అనుమతి వచ్చింది. దానివల్ల ఆ వ్యాక్సిన్‌ దిగుమతికి మార్గం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్నది మున్ముందు తెలుస్తుంది’’ అని మాత్రమే పేర్కొన్నారు.  28 రోజుల వ్యవధిలో మోడెర్నా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని