సర్కారు వైద్యంలోనూ.. మోనోక్లోనల్‌ చికిత్స

ఇప్పటి వరకూ కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులకే పరిమితమైన మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్స ఇప్పుడు సర్కారు వైద్యంలోనూ అందుబాటులోకి వచ్చింది.

Updated : 21 Aug 2021 06:06 IST

ఇప్పటికే నిమ్స్‌, గాంధీ ఆసుపత్రుల్లో అందుబాటులోకి

జిల్లా దవాఖానాలకూ విస్తరించాలని నిర్ణయం

కొవిడ్‌ మూడో దశలో ఇదే కీలకమవుతుందని అంచనా

ఈనాడు - హైదరాబాద్‌

ఇప్పటి వరకూ కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులకే పరిమితమైన మోనోక్లోనల్‌ యాంటీబాడీల చికిత్స ఇప్పుడు సర్కారు వైద్యంలోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి సుమారు 400-500 వరకూ మోనోక్లోనల్‌ యాంటీబాడీల ఇంజక్షన్లు ఉన్నాయి. వీటిని గాంధీ ఆసుపత్రిలో, నిమ్స్‌లో వినియోగిస్తున్నారు. ఈ చికిత్సతో కొవిడ్‌ బాధితుల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మూడోదశ ఉద్ధృతి వస్తే ఈ చికిత్స కీలకమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చికిత్సకు రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదనీ, 2-3 రోజుల్లోనే బాధితుడిని ఇంటికి పంపించే అవకాశాలుంటాయని వివరిస్తున్నారు. దీనివల్ల ఆసుపత్రుల్లో పడకల కొరత సమస్య కూడా పరిష్కారమవుతుందనీ, కేవలం గాంధీ, నిమ్స్‌లలోనే కాకుండా జిల్లా ఆసుపత్రుల్లోనూ ఈ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

ప్రత్యేకతలు ఇలా...

మన శరీరంలో చాలా రకాల యాంటీబాడీలుంటాయి. అందులో వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్నే. అటువంటి వాటిలో ‘టసిరిబిమాబ్‌, ఇమిడెవిమాబ్‌’ అనే రెండు రకాలను ప్రత్యేకంగా సేకరించి వాటిని వృద్ధి చేశారు. ఇలా ప్రత్యేకంగా ఒకట్రెండు రకాలను మాత్రమే సేకరించి వృద్ధి చేసే విధానాన్ని ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీలు’ అంటారు. ఈ రెండూ ఇంజక్షన్ల రూపంలో లభిస్తాయి. కొవిడ్‌ బారినపడిన తొలి వారంలో వీటిని ఇవ్వడం ద్వారా అధిక ప్రయోజనాలున్నాయనీ, ఇప్పటివరకూ వీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే 100 శాతం మంది కోలుకున్నారని నిపుణులు చెబుతున్నారు. 70-80 శాతం మంది 3-4 రోజుల్లో.. అత్యధికులు వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారని వివరిస్తున్నారు. దీని ధర ప్రస్తుతం సుమారు రూ.70వేల వరకూ ఉండగా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం. ‘‘విచ్చలవిడిగా వాడితే కొరత ఏర్పడవచ్చు. బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవాలనే పెడధోరణులు రావొచ్చు. అందుకే ఎవరికైతే ముప్పు ఎక్కువ ఉందో వారికే ఉపయోగించాలి. ఆ అవగాహన రోగులకూ ఉండేలా చూడాలి’’ అని నిపుణులు సూచిస్తున్నారు.


ముందస్తు కొనుగోలుపై దృష్టి

కొవిడ్‌ చికిత్సలో మోనోక్లోనల్‌ యాంటీబాడీల ప్రాధాన్యం తెలిసి రావడంతో.. ప్రభుత్వం వీటి కొనుగోలుపై దృష్టిపెట్టింది. రెండోదశలో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు పెరిగిన డిమాండ్‌.. ఫలితంగా తీవ్ర కొరత.. రోగుల ఇక్కట్లు.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మోనోక్లోనల్‌ యాంటీబాడీల ఇంజక్షన్ల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతానికి ఒకే సంస్థ వీటిని సరఫరా చేస్తోంది. ఆ సంస్థ ప్రతినిధులతో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సంప్రదింపులు నిర్వహించారు.


ఎవరికి ఎక్కువ మేలంటే... 

* 65 ఏళ్లు దాటిన వారు

* రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వినియోగిస్తున్నవారు ఉదాహరణకు క్యాన్సర్‌ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు

* దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు

* స్థూలకాయులకు అంటే  ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ 35 కంటే ఎక్కువ ఉన్నవారు

* దీర్ఘకాలంగా మధుమేహానికి చికిత్స పొందుతున్నవారు

* క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌, ఆస్తమాతో బాధపడుతున్నవారు

* 55 ఏళ్లు దాటి అధిక రక్తపోటుతో పాటు గుండెజబ్బుతో బాధపడుతున్నవారు

* 12 ఏళ్లు దాటిన వారిలోనూ పై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముప్పు తీవ్రత ఉన్నవారికి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని