తాలిబన్ల సంబరాలు

సంతోషంతో కేరింతలు.. విజయ గర్వంతో హూంకారాలు.. గాల్లోకి కాల్పులు.. రన్‌వేపై పరుగులు.. కాబుల్‌ విమానాశ్రయంలో మంగళవారం కనిపించిన దృశ్యాలివి. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా

Updated : 01 Sep 2021 12:38 IST

వారి నియంత్రణలోకి కాబుల్‌ విమానాశ్రయం

కాబుల్‌: సంతోషంతో కేరింతలు.. విజయ గర్వంతో హూంకారాలు.. గాల్లోకి కాల్పులు.. రన్‌వేపై పరుగులు.. కాబుల్‌ విమానాశ్రయంలో మంగళవారం కనిపించిన దృశ్యాలివి. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా వెనుదిరగడంతో తాలిబన్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందంటూ నినాదాలు చేశారు. ఇకపై దేశం తమ చేతుల్లో భద్రంగా ఉంటుందంటూ ప్రసంగాలు ఊదరగొట్టారు.

అమెరికా చివరి విమానం కాబుల్‌ నుంచి బయలుదేరి వెళ్లాక.. తాలిబన్లు విమానాశ్రయంలోకి ప్రవేశించారు. దాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అమెరికా బలగాల తరహాలో దుస్తులు ధరించిన ‘బద్రి 313’ ప్రత్యేక విభాగం అంగరక్షకులు తోడు రాగా.. తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌, మరో కీలక నేత హెక్మతుల్లా వసీఖ్‌ విమానాశ్రయంలో కలియతిరిగారు. ముఠా సభ్యులతో కూడిన వాహనాలు రన్‌వేపై చక్కర్లు కొట్టాయి. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) టవర్‌లోకి కూడా తాలిబన్లు ప్రవేశించారు. టవర్‌లో ఇద్దరు కూర్చోగా.. వారికి మరొకరు కాపలాగా నిల్చున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానాశ్రయం బయట, దాదాపుగా కాబుల్‌ నగరమంతటా తాలిబన్లలో కోలాహలం కనిపించింది. విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో వారు చెక్‌పోస్టులు తొలగించారు.

స్వలింగ సంపర్కుడిపై అత్యాచారం

అఫ్గాన్‌లో మహిళల హక్కులను కాలరాస్తున్న తాలిబన్లు.. స్వలింగ సంపర్కులపైనా ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఓ స్వలింగ సంపర్కుడిని అమానుషంగా హింసించారు. అత్యాచారం చేసి, ఆపై విచక్షణరహితంగా దాడి చేశారు. అఫ్గాన్‌ను వీడేందుకు ఆ స్వలింగ సంపర్కుడు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తితో సంప్రదింపులు జరిపారు. అవతలి వ్యక్తి తాలిబన్‌ మనిషి అని గుర్తించలేకపోయారు. 

పంజ్‌షేర్‌లో ఎదురుదెబ్బ

అఫ్గాన్‌లో ఇప్పటికీ తమ అధీనంలోకి రాని పంజ్‌షేర్‌ ప్రావిన్సును ఎలాగైనా ఆక్రమించాలని తాలిబన్లు గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి వారు ఆ ప్రావిన్సుపై దాడి చేశారు. అయితే వారికి అక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజా ఘర్షణల్లో 7-8 మంది తాలిబన్‌ ముఠా సభ్యులు హతమయ్యారని పంజ్‌షేర్‌ అధినేత అహ్మద్‌ మసూద్‌ అధికార ప్రతినిధి ఫహీం దష్తీ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని