Updated : 01/09/2021 04:48 IST

ఇక సెలవు

అఫ్గాన్‌ను వీడిన అమెరికా సైనికులు

గడువుకు ఒకరోజు ముందే తరలింపు పూర్తి

రెండు దశాబ్దాల పోరాటానికి తెర

ముష్కరుల చేతికి చిక్కకుండా ఆయుధ వ్యవస్థల నిర్వీర్యం

చివరిరోజు కాబుల్‌ విమానాశ్రయంలో ఉద్విగ్న వాతావరణం

కాబుల్‌, వాషింగ్టన్‌: ప్రపంచ చరిత్రలో ఓ కీలక అధ్యాయానికి తెరపడింది! అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాల 20 ఏళ్ల ప్రస్థానం ముగిసింది! ఆ దేశం నుంచి అగ్రరాజ్య బలగాలు పూర్తిగా వెనక్కి మళ్లాయి. అఫ్గాన్‌ గడ్డపై ముష్కర మూకలను నిర్మూలించాలన్న తమ లక్ష్యం నెరవేరలేదన్న వేదన మనసుల్ని కుంగదీస్తున్నా.. ఆ దేశాన్ని తాలిబన్ల చేతుల్లో పెట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్వదేశానికి పయనమయ్యాయి. ముందుగా నిర్దేశించుకున్న గడువుకు ఒకరోజు ముందుగానే తరలింపు చర్యలకు గుమ్మడికాయ కొట్టేశాయి!

అఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి అమెరికా మంగళం పలికింది. అక్కడి నుంచి తమ సైనికులందర్నీ వెనక్కి రప్పించింది. తాలిబన్ల ఆక్రమణ అనంతరం గత రెండు వారాలుగా అఫ్గాన్‌ నుంచి విదేశీ పౌరులు, బలగాలు, శరణార్థుల తరలింపు చర్యలను అమెరికా ముమ్మరంగా కొనసాగించింది. మంగళవారం (ఆగస్టు 31) కల్లా తరలింపులను పూర్తిచేయాలని తుది గడువు విధించుకుంది. అయితే అంతకంటే ఒకరోజు ముందే వాటిని ముగించింది. అగ్రరాజ్యానికి చెందిన చివరి సి-17 విమానం కాబుల్‌ విమానాశ్రయం నుంచి సోమవారం అర్ధరాత్రి బయలుదేరి వెళ్లింది. దాదాపు 200 మంది అమెరికన్లు ఇంకా అఫ్గాన్‌లోనే ఉన్నారు. ప్రస్తుతానికి తరలింపు చర్యలను ముగించినప్పటికీ.. అఫ్గాన్‌లోని అమెరికన్లుగానీ, ఇతర అఫ్గానీలుగానీ దేశం వీడాలనుకుంటే వారికి సహాయం చేస్తామని అమెరికా భరోసా ఇచ్చింది.

‘అనుకున్నంతమందిని తరలించలేకపోయాం’

అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహణ సోమవారం ఉద్వేగపూరితంగా సాగింది. ఐఎస్‌ఐఎస్‌-కె ఉగ్రవాదులు దాడులు చేసే ముప్పు పొంచి ఉండటంతో ఆఖరి విమానం బయలుదేరే వరకూ సైనికులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. చివరి కొన్ని గంటల్లో కాబుల్‌ నుంచి దాదాపు 1,500 మంది అఫ్గానీలను తాము సురక్షితంగా బయటకు తీసుకెళ్లామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్‌ మెరీన్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకంజీ తెలిపారు. తరలింపు చర్యలను ముగించే సమయానికి విమానాశ్రయంలో పౌరులెవరూ లేరని స్పష్టం చేశారు. ‘‘ఉద్విగ్న క్షణాల మధ్య మేం కాబుల్‌ను వీడాం. అనుకున్నంత మందిని తరలించలేకపోయాం’’ అని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో తమ ఆయుధ వ్యవస్థలు, ఇతర అధునాతన సామగ్రి.. ముష్కరుల చేతికి చిక్కకుండా అమెరికా బలగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. విమానాశ్రయం వద్ద మోహరించిన ‘రాకెట్లు, మోర్టార్ల విధ్వంసక వ్యవస్థ (సి-రామ్‌)’ సహా పలు ఆయుధ వ్యవస్థలను నిర్వీర్యం చేశాయి. కాబుల్‌లో విమానాల రాకపోకలు కొనసాగేందుకు ఉపయోగపడే అగ్నిమాపక వాహనాలు వంటి కొన్నింటిని తాలిబన్లు ఉపయోగించుకునేలా అక్కడే ఉంచాయి.

అమెరికాలోనూ ఉద్విగ్నత

తరలింపు చర్యల చివరి 90 నిమిషాలను పెంటగాన్‌లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. తమ సైనికులు రన్‌వేపై తనిఖీలు చేపట్టడం, కీలక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, సి-17 విమానాల్లోకి ఎక్కడం వంటి పరిణామాలన్నింటినీ నిశ్శబ్దంగా చూశారు. చివరి విమానం టేకాఫ్‌ అయ్యేటప్పుడు పెంటగాన్‌లోనూ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆ విమానం సురక్షితంగా బయలుదేరాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం.. తరలింపు చర్యల్ని సమన్వయం చేసిన మేజర్‌ జనరల్‌ క్రిస్టోఫర్‌ డానహ్యూ (82వ ఎయిర్‌బార్న్‌ డివిజన్‌ కమాండర్‌)కు ఆస్టిన్‌ ఫోన్‌ చేశారు. కాబుల్‌లో అందరికంటే చివరగా విమానం ఎక్కింది డానహ్యూయే. ఆయన కంటే ముందు అఫ్గాన్‌లో అమెరికా రాయబారిగా ఉన్న రాస్‌ విల్సన్‌ విమానంలోకి ప్రవేశించారు.


చొరబాటుదారులకు గుణపాఠం

‘‘అఫ్గానిస్థాన్‌కు శుభాకాంక్షలు. ఈ విజయం మనందరిదీ. తాలిబన్లు సాధించిన ఈ గెలుపు చొరబాటులందరికీ గుణపాఠం’’   అని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన కాబుల్‌ విమానాశ్రయం రన్‌వేపైనే వందల మంది ముఠా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నింటితో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరో కీలక నేత హెక్మతుల్లా వసీఖ్‌ మాట్లాడుతూ..  అందరికీ తాము క్షమాభిక్ష ప్రసాదించామని పునరుద్ఘాటించారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోవడంతో అఫ్గాన్‌కు సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిందని తాలిబన్‌ రాజకీయ విభాగంలోని కీలక నేత షహాబుద్దీన్‌ దిలావర్‌ వ్యాఖ్యానించారు. త్వరలోనే దేశం ప్రగతి బాటలో పయనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని