ఇంటర్‌లో 70% సిలబస్సే!

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-22) కూడా ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్సే ఉండనుంది. కరోనా పరిస్థితుల కారణంగా గత ఏడాది 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించిన సంగతి తెలిసిందే.

Published : 30 Sep 2021 03:17 IST

రాష్ట్రాలకు కేంద్రం సూచన

త్వరలో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-22) కూడా ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్సే ఉండనుంది. కరోనా పరిస్థితుల కారణంగా గత ఏడాది 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 70 శాతం సిలబస్‌ ఆధారంగానే పరీక్షలు ఉండేలా చూడాలని సూచిస్తూ కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్ర విద్యాశాఖ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.

పరీక్షలు తప్పనిసరా?

గత మే నెలలో జరగాల్సిన ద్వితీయ ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారికి మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలోనూ వేసి ధ్రువపత్రాలు ఇచ్చింది. ప్రథమ ఇంటర్‌ విద్యార్థులను మాత్రం పరీక్షలు లేకుండానే రెండో ఏడాదిలోకి ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అనుకూల పరిస్థితుల్లో పరీక్షలు జరుపుతామని ఆనాడు పేర్కొంది. విద్యార్థులు మాత్రం ప్రమోట్‌ అంటే 35 శాతం కనీస మార్కులతో పాసైనట్లేననుకున్నారు. ఒకవేళ భవిష్యత్తులో పరీక్షలు జరిపినా ఇష్టం లేకుంటే రాయాల్సిన అవసరం లేదని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కాలపట్టిక ప్రకటించింది. అయితే అందరూ తప్పనిసరిగా రాయాలా? కనీసం 35 శాతం మార్కులు ఇవ్వరా? అన్న దానిపై స్పష్టత లేదు.  దీనిపై కూడా ప్రభుత్వ స్థాయిలో చర్చ సాగుతున్నట్లు సమాచారం.

రెండు సెక్షన్లలో 50 శాతం ఛాయిస్‌!

కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు జరగనందున గత మే నెలలో జరగాల్సిన వార్షిక పరీక్షల్లో రెండు సెక్షన్లలో 50 శాతం ఛాయిస్‌ ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ప్రశ్నపత్రాల్లో ఏ, బి, సి సెక్షన్లు ఉంటాయి. అందులో ఏ సెక్షన్‌లో గతంలో మాదిరిగానే 10కి 10 ప్రశ్నలకు జవాబులు రాయాలి. బి, సి సెక్షన్లలో 7లో 5 ప్రశ్నలకు గతంలో సమాధానాలు రాయాల్సి ఉండగా...10లో 5 రాసేలా విధానాన్ని మార్చాలని అనుకున్నారు. చివరకు పరీక్షలు జరగలేదు. వాటినే ఈసారి అక్టోబరు 25వ తేదీ నుంచి జరిగే ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షల్లో అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని