లఖింపుర్‌పై తీసుకున్నచర్యలేంటి?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను వివరిస్తూ శుక్రవారం నాటికి స్థాయీ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Updated : 08 Oct 2021 07:01 IST

 రైతుల మరణాలు దురదృష్టకరం

స్థాయీ నివేదిక సమర్పించండి

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆదేశం

ఈనాడు, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను వివరిస్తూ శుక్రవారం నాటికి స్థాయీ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌, అరెస్టు చేసిన నిందితుల వివరాల గురించి శుక్రవారం చెప్పాలని స్పష్టంచేశారు. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్‌ త్రిపాఠి, సీఎస్‌ పాండా అనే న్యాయవాదులు సీజేఐకి లేఖలు రాశారు. వీటిపై జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లీల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

సమాచార లోపంతో సుమోటో అయింది

‘‘ఘటనను సుమోటోగా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు రాసిన లేఖల ఆధారంగా ఈ అంశాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద నమోదు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించాను. సమాచార లోపం వల్ల రిజిస్ట్రీ దీన్ని సుమోటో కేసుగా నమోదు చేసింది. అది పెద్ద విషయం కాదు. మేం విచారిస్తాం’’ అని జస్టిస్‌ రమణ చెప్పారు. లేఖ రాసిన న్యాయవాది శివకుమార్‌ త్రిపాఠి వాదనలు వినిపిస్తూ- రాష్ట్ర పాలనా వ్యవస్థ నిర్లక్ష్యం, ఇతర కారణాల వల్ల హింసాత్మక ఘటనల్లో రైతులు, ఇతరులు చనిపోయారని, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నందున కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, జ్యుడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశామని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ గరిమా ప్రసాద్‌ చెప్పారు. ‘మీరు (యూపీ ప్రభుత్వం) సరిగా దర్యాప్తు చేయడం లేదని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. దానిపై ఏమంటారు?’ అని జస్టిస్‌ రమణ ప్రశ్నించారు. అందుకు ఆమె జవాబిస్తూ ‘‘అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ ఏర్పాటు చేశాం. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. కొంత సమయం ఇస్తే విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో సమర్పిస్తాం’’ అని చెప్పారు. అలహాబాద్‌ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల వివరాలనూ శుక్రవారానికల్లా సమర్పిస్తామని చెప్పారు.

నిందితులను అరెస్టు చేశారా?: జస్టిస్‌ సూర్యకాంత్‌

‘‘మరణించిన వారిలో కొందరు రైతులు, ఒక పాత్రికేయుడు, మరికొందరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరందరూ హత్యకు గురయ్యారు. నిందితులెవరు? అందులో ఎవరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు? అరెస్టులు చేశారా? లేదా? అనే వివరాలనూ మీ స్థాయీ నివేదికలో పొందుపరచండి’’ అని  జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆదేశించారు.


ఆ తల్లికి మెరుగైన వైద్యం అందించండి

కేసు విచారణ జరుగుతుండగానే అమృత్‌పాల్‌ సింగ్‌ ఖల్సా అనే న్యాయవాది నుంచి వచ్చిన సందేశాన్ని సీజేఐ చదివి వినిపించారు. లఖింపుర్‌ ఖేరి ఘటనలో తనయుడు లవ్‌ప్రీత్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోవడంతో దిగ్భ్రాంతితో ఆయన తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమెకు తక్షణం వైద్య సౌకర్యం అందించేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరిన విషయాన్ని చెప్పారు. ఆమెకు చిన్న ఆసుపత్రిలో కాకుండా సమీపంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పూర్తిస్థాయి వైద్యం యూపీ ప్రభుత్వం తరఫున అందించేలా చూడాలని ఏఏజీ గరిమా ప్రసాద్‌ను ఆదేశించారు.


ఘటనపై విచారణకు.. ఏకసభ్య న్యాయ కమిషన్‌

  విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌కుమార్‌ శ్రీవాస్తవనేతృత్వంలో ఏర్పాటు

లఖ్‌నవూ, ఈనాడు-లఖ్‌నవూ: లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై విచారణకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఏకసభ్య న్యాయ కమిషన్‌ను నియమించింది. అలహాబాద్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌కుమార్‌ శ్రీవాస్తవ ఈ విచారణ చేపడతారని గురువారం వెల్లడించింది. లఖింపుర్‌ ఖేరిలోని ప్రధాన కార్యాలయం నుంచి పనిచేయాలని, రెండు నెలల్లో విచారణను ముగించాలని కమిషన్‌కు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది.

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

ఘటనకు ప్రధాన బాధ్యుడిగా భావిస్తున్న ఆశిష్‌ మిశ్రకు పోలీసులు సమన్లు జారీచేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలీస్‌ లైన్స్‌లోని కార్యాలయానికి రావాలని ఆదేశించారు. అయితే, ఆశిష్‌ పరారీలో ఉండటంతో, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్న మొత్తం ఏడుగురిలో ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఐజీ లక్ష్మీసింగ్‌ వెల్లడించారు. లవ్‌కుశ్‌, ఆశిష్‌ పాండేలుగా గుర్తించిన వారిద్దరూ రైతులపైకి దూసుకెళ్లిన కాన్వాయ్‌లో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.


అజయ్‌ మిశ్రపై 17 ఏళ్ల కిందటే హత్య కేసు!

తాజా పరిణామాలతో- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రపై 17 ఏళ్ల కిందట నమోదైన ఓ హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తికోనియాలోనే 2003లో ప్రభాత్‌ గుప్తా అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించి అజయ్‌ మిశ్ర, మరికొందరిపై అప్పట్లో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి... సరైన సాక్ష్యాధారాలు లేవంటూ 2004లో మిశ్ర, మరికొందరిని తప్పించారు. దీన్ని సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మృతుని కుటుంబ సభ్యులు రివిజన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ విచారణ చేపట్టింది. 2018, మార్చి 12న తీర్పు వెల్లడిస్తామని తెలిపి, తర్వాత మరిన్ని వాదనలు వింటామని పేర్కొంది. కోర్టు వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం- ఈ కేసులో చివరిసారిగా గత ఏడాది ఫిబ్రవరి 25న విచారణ జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని