
Covid: పండగల వేళ.. కొవిడ్ జాగ్రత్తలు తగ్గుతున్నాయ్!
‘లోకల్ సర్కిల్స్’ సర్వేలో వెల్లడి
దిల్లీ: దేశంలో ఓవైపు పండగల సీజన్ ముమ్మరం కాగా మరోవైపు ఎక్కువమంది ప్రజలు మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్ జాగ్రత్తలను పట్టించుకోవడం లేదని తాజాగా ఓ సర్వేలో తేలింది. లోకల్ సర్కిల్స్ అనే డిజిటల్-కమ్యూనిటీ వేదిక దేశవ్యాప్తంగా 366 జిల్లాల్లోని 65 వేల మందిని సర్వే చేసింది. ప్రయాణాల సమయంలోను, వ్యాక్సినేషన్ కేంద్రాలు వంటివాటి వద్ద ప్రజలు కొవిడ్ జాగ్రత్తలు ఎలా పాటిస్తున్నారు.. తదితర అంశాలపై వివరాలు సేకరించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 64% మంది పురుషులు కాగా 36% మహిళలు. తమ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు పెట్టుకుంటున్నారని 13% మంది మాత్రమే చెప్పారు. కేవలం 6% మంది తమ ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్లో ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఎక్కువ మంది మాస్కులు ధరిస్తున్నట్లు 29% మంది చెప్పారు. అలాగే భౌతిక దూరం నిబంధనలు అమలవుతున్నట్లు 11% మంది తెలిపారు. తాజా సర్వేలో ఆ గణాంకాలు దాదాపు సగానికి తగ్గిపోవడం ద్వారా ప్రజలు కొవిడ్ మహమ్మారి వెళ్లిపోయిందని భావిస్తున్నట్లు తెలుస్తోందని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా చెప్పారు. పండగల సీజన్ నేపథ్యంలో సామాజిక కార్యకలాపాలు, కార్యక్రమాలు, షాపింగ్ వంటివి గణనీయంగా పెరిగాయని, దీంతో కొవిడ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.