ధాన్యానికి దక్కని హామీ

ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న పీటముడి వీడలేదు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటామనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చిచెప్పలేదు. ఈ అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ను.

Updated : 27 Nov 2021 04:59 IST

కొనుగోళ్లపై తేల్చని కేంద్ర మంత్రి పీయూష్‌

వేసవి సాగులో వరి వేయొద్దని సూచన

కేంద్రం తీరుపై రాష్ట్ర మంత్రుల అసంతృప్తి

ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న పీటముడి వీడలేదు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటామనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చిచెప్పలేదు. ఈ అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం కలిసింది. తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిశారని, తాము మంగళవారం కలిసినప్పుడు కూడా అన్ని వివరాలు వెల్లడించామని మంత్రుల బృందం గుర్తు చేసింది. రాత్రి 8.40 గంటల నుంచి 10 గంటల వరకు గంటకుపైగా పరిస్థితులను వివరించినా గోయల్‌ నుంచి ఎటువంటి సానుకూల స్పందన లభించలేదు. మూడు రోజుల క్రితం కలిసినప్పుడు కొంత సానుకూలంగా స్పందించినందున కొనుగోళ్లను 40 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు పెంచుతారని ఆశించామని రాష్ట్ర మంత్రులు చెప్పగా.. తాను కేంద్ర వ్యవసాయమంత్రి, అధికారులతో మాట్లాడానని వారినుంచి ఎటువంటి సానుకూలత రాలేదని గోయల్‌ బదులిచ్చారు. ఏడాదికి ‘మీరు ఎంత కొంటారో స్పష్టతనిస్తే రైతులకు దిశానిర్దేశం చేయడానికి కుదురుతుందని’ రాష్ట్ర మంత్రులు తెలిపారు. తాము గత విధానాన్నే అవలంబిస్తామని, ఏడాదికి ఎంత కొంటామనే విషయం చెప్పలేమని గోయల్‌ బదులిచ్చారు. ఉప్పుడు బియ్యం కొనే ప్రసక్తే లేదని గతంలోనే స్పష్టం చేశామని.. అదేమాట ఇప్పుడూ చెబుతున్నానని తేల్చిచెప్పారు. ఏ మాత్రం సానుకూల స్పందన లేకపోవడంతో మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసి బయటకు వచ్చేశారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఇతర అధికారులు ఉన్నారు.


యాసంగిలో వరి వేయొద్దన్నారు

 రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి

కేంద్రమంత్రిని కలిసిన అనంతరం తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్రమంత్రి ఆహ్వానం మేరకు మేం చాలా ఆశతో వచ్చాం. కేంద్రం కచ్చితమైన పరిష్కారం చూపుతుందనే అనుకున్నాం. దురదృష్టవశాత్తూ వారు నిరాశపరిచారు. ఆశాజనక హామీ దక్కలేదు. యాసంగిలో వరి వేయొద్దని చాలా గట్టిగా చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రంలో మీ పార్టీ వాళ్లే గందరగోళం సృష్టిస్తున్నారని మేమన్నాం. వారు తెలిసో తెలియకో మాట్లాడారు.. మేం వారించాక మాట్లాడటం లేదని కేంద్రమంత్రి చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే నిర్ణయంపై కమిటీ వేయబోతున్నామని గోయల్‌ తెలిపారు. ఆ కమిటీ నిర్ణయం మేరకు వార్షిక లక్ష్యాలు, మద్దతు ధరపై చెబుతామన్నారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. సంవత్సరం మొత్తానికి ఎంత కొంటారో చెప్పమంటే గత విధానాన్నే అవలంబిస్తామంటున్నారు కానీ నిర్మాణాత్మకంగా చెప్పడం లేదు. మిగతా వివరాలు సీఎంతో మాట్లాడి చెబుతాం’’ అని మంత్రి తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని