Updated : 28/11/2021 05:37 IST

మన ‘సిన్నతల్లి’.. 20 ఏళ్లుగా తల్లడిల్లి!

తమ్ముడిని చంపినోళ్లకు శిక్ష పడాలని సోదరి పోరాటం  
పోలీసు దెబ్బలతో లాకప్‌లో మరణించిన యువకుడు!  
సిద్దిపేట జిల్లాలో ‘జైభీమ్‌’ సినిమాను తలపించే ఘటన

యాదగిరి ఫొటోతో అతడి సోదరి లక్ష్మీనర్సవ్వ

దొంగతనం అనుమానంతో అమాయకులను పోలీసులు  స్టేషన్‌కు తీసుకువెళ్లి క్రూరంగా హింసించడం.. దెబ్బలకు తట్టుకోలేక వారిలో ఒకరు చనిపోతే తప్పు కప్పిపుచ్చుకోడానికి కట్టుకథలల్లడం.. చివరకు న్యాయస్థానంలో దోషులుగా తేలడం.. ఇటీవల విడుదలైన ‘జైభీమ్‌’ సినిమాలో కథాంశమిది. ఎప్పుడో తమిళనాడులో జరిగిన యథార్థగాథ ఆధారంగా తీసిన ఆ సినిమాలో ‘సిన్నతల్లి’ పోరాటం ఫలించి లాకప్‌డెత్‌ బాధ్యులకు శిక్ష పడుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది. తమిళనాడులో భర్త కోసం సిన్నతల్లి పోరాడితే ఇక్కడ తన తమ్ముడి లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసులకు తగిన శిక్ష పడాలని పోరాడుతోంది అతడి సోదరి లక్ష్మీనర్సవ్వ. దాదాపు 20 ఏళ్లు అవుతున్నా ఆమెకు మాత్రం ఇంకా న్యాయం దక్కలేదు. మరో పదేళ్లయినా పోరాడతానని చెబుతోంది.  

అసలేం జరిగింది?

తొగుట మండలం వెంకట్రావుపేటలో 2002 ఏప్రిల్‌లో ప్రభాకర్‌ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఈ కారణంగా ఊర్లో ఘర్షణ జరిగింది. ఈ కేసులో ఏప్రిల్‌ 5న యాదగిరిని తొగుట పోలీసులు తీసుకెళ్లారు. మూడురోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అతడితో పాటు మరో ఆరుగురిని తీసుకెళ్లి ప్రశ్నించి పంపినా.. యాదగిరిని మాత్రం వదల్లేదు. తన తమ్ముడు అమాయకుడని, అతడిని వదిలిపెట్టాలని సోదరి లక్ష్మీనర్సవ్వ ఎంత బతిమిలాడినా కరుణించలేదు. మూడు రోజుల పాటు తీవ్రంగా కొట్టి హింసించారని, నాలుగో రోజు వెళితే కనీసం మాట్లాడనివ్వలేదని గుర్తు చేసుకున్నారామె. చివరకు ‘జైభీమ్‌’ సినిమాలోలాగే ‘మీ తమ్ముడు స్టేషన్‌ నుంచి పరారయ్యాడు’ అని ఆమెకు చెప్పారు. ఆమె గట్టిగా నిలదీసినా కట్టుకథలు చెప్పారు. బంధువుల ఇళ్లలో వెతకమని సూచించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులే ఏదో చేసి ఉంటారనే అనుమానంతో ఆమె పట్టువదల్లేదు. ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అప్పటి సిద్దిపేట డీఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షణలో విచారణ జరిగింది. 2002 ఏప్రిల్‌ 8న స్టేషన్‌లో యాదగిరి మృతిచెందగా.. పోలీసులే అతడి మృతదేహాన్ని తీసుకువెళ్లి కొండపాక మండలంలోని పెద్దగుట్టపై పాతిపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు మూడు నెలల తర్వాత రీపోస్టుమార్టం నిర్వహించగా మరణించడానికి ముందు యాదగిరిని తీవ్రంగా కొట్టినట్లు తేలింది. సీఐ, ఎస్సైతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను బాధ్యులుగా తేల్చి అరెస్టు చేశారు. వారు 90 రోజుల పాటు విచారణ ఖైదీలుగా ఉన్నారు. విడుదలయ్యాక వారికి తిరిగి పోస్టింగ్‌లు ఇచ్చారు.  


సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోదరి

న తమ్ముడి మృతికి కారకులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోలేదంటూ లక్ష్మీనర్సవ్వ 2005లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమగ్ర విచారణ చేపట్టాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో మళ్లీ విచారణ మొదలైంది. సీఐడీ సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అప్పటినుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఇటీవలే కోర్టు కొట్టేసింది. ‘మూడోరోజు స్టేషన్‌కు వెళ్లినప్పుడు నా తమ్ముడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఒళ్లంతా దెబ్బలే. పోలీసులే వాడి ప్రాణం తీసేశారు. పెద్దగుట్ట మీద పాతిపెట్టిన శవాన్ని నా కళ్లముందే పోలీసులు మళ్లీ వెలికితీశారు. వారి అదుపులో ఉన్న వ్యక్తి చనిపోయి ఇలా బొందలో దొరికాడు’ అని లక్ష్మీనర్సవ్వ ఆవేదన వ్యక్తంచేస్తోంది. తన మామకు జరిగిన అన్యాయం గురించి తల్లి చెప్పగా విన్న ఆమె కొడుకు నవీన్‌ ఇటీవల వచ్చిన జైభీమ్‌ సినిమా ఆమెకు చూపించారు. అది చూస్తే తమ్ముడే గుర్తుకొచ్చాడని ఆమె చెమ్మగిల్లిన కళ్లతో చెప్పింది.


హైకోర్టుకు వెళ్తానంటోంది..

కేసులో మృతుడు యాదగిరి తరఫున వకాల్తా తీసుకున్న న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సరైన సాక్ష్యాధారాలు లేవంటూ సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఇటీవల కేసు కొట్టివేసిందని, దీంతో హైకోర్టును ఆశ్రయిస్తానని లక్ష్మీనర్సవ్వ చెప్పిందని ఆయన వివరించారు. ఎప్పటికైనా తన సోదరుడికి న్యాయం జరగాలని ఆమె ఆశిస్తోందన్నారు.


సమాధిపై చరిత్ర లిఖితం

పోలీసుల కారణంగా యాదగిరి లాకప్‌లో చనిపోయారంటూ సమాధిపై శిలాఫలకం

రీపోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తమ్ముడి శరీరభాగాలను తీసుకెళ్లి.. మిరుదొడ్డిలోని వెంకట్రావుపేటలో సమాధి కట్టించింది లక్ష్మీనర్సవ్వ. అంతేకాదు దానిపై ఓ శిలాఫలకాన్ని పెట్టించింది. ‘8.04.2002 రోజున పోలీస్‌ సీఐ మధుకర్‌స్వామి వలన లాకప్‌డెత్‌లో మరణించినాడు. వాడిని పూడ్చిపెట్టిన స్థలం బంజేరుపల్లి పెద్దగుట్ట. కొండపాక మండలం’ అంటూ సమాధిపై రాయించిందంటే ఆమె తెగువ, పట్టుదల అర్థమవుతోంది. తన తమ్ముడిని పోలీసులు దారుణంగా హింసించి చంపిన ఘటన అందరికీ తెలియాలనే ఇలా రాయించానని ఆమె చెప్పింది.

- ఈనాడు, సిద్దిపేట, న్యూస్‌టుడే, మిరుదొడ్డి

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని