కలెక్టరేట్లలో ధరణి సహాయక కేంద్రాలు!

భూసమస్యలపై ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో... ఎలా చేసుకోవాలో తెలియని వారికోసం జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా సహాయ కేంద్రాలు(హెల్ప్‌డెస్క్‌) ఏర్పాటు చేయనున్నారు. ధరణిని ఏర్పాటుచేసి ఏడాది పూర్తయినా బాధితుల

Published : 28 Nov 2021 05:04 IST

నేరుగా భూసమస్యల స్వీకరణ, పరిష్కారం
మంత్రివర్గ ఉపసంఘం కీలక సూచనలు!

ఈనాడు, హైదరాబాద్‌: భూసమస్యలపై ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో... ఎలా చేసుకోవాలో తెలియని వారికోసం జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా సహాయ కేంద్రాలు(హెల్ప్‌డెస్క్‌) ఏర్పాటు చేయనున్నారు. ధరణిని ఏర్పాటుచేసి ఏడాది పూర్తయినా బాధితుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. సమస్య పరిష్కారం కోరుతూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి కూడా ఈ విషయం వచ్చినట్లు తెలిసింది. ప్రజలు సులువుగా తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలు కల్పించాలని.., తగిన ఏర్పాట్లు చేయాలని సంఘం కీలక సూచనలను చేసినట్లు తెలిసింది.

ఇకపై ఎడాపెడా తిరస్కరిస్తే కుదరదు

సాగులో ఉన్న రైతుకు చెందిన సగం భూమి పాసుపుస్తకంలో నమోదు కాగా మరికొంత నమోదు చేయలేదు. దీనిపై ధరణిలో దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్లు వాటిని తిరస్కరిస్తున్నారు. చాలా జిల్లాల్లో ఇలాంటి కేసులు ఇటీవల వెలుగుచూశాయి. ఆన్‌లైన్‌లో నిషేధిత జాబితాకు సంబంధించిన దరఖాస్తులు దాదాపు 99 వేలు రెవెన్యూశాఖకు వచ్చాయి. వాటిలో పరిష్కరించినవి చాలా తక్కువే అయినప్పటికీ తిరస్కరించిన వాటితో కలిపి 80 వేల వరకు డిస్పోజ్‌ చేసినట్లు జాబితాలో చూపుతున్నారు. ఇకపై ఏదైనా దరఖాస్తును తిరస్కరించాలంటే దానికి కారణాన్ని చూపే దస్త్రాన్ని తప్పనిసరిగా జోడించాలనే నిబంధనను అమలు చేయనున్నారు. బాధితునికి కూడా వివరాలను తప్పనిసరిగా అందజేయాలి. వచ్చే దరఖాస్తులు, పరిష్కారాలపై పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉపసంఘం నిర్ణయించినట్లు తెలిసింది. భూసమస్యపై బాధితులు ఎన్నిసార్లైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నారు. ప్రజలకు మేలు చేసేలా సేవలు ఉండాలని, వారి అభ్యర్థనలను స్వీకరించి వీలైనంత వరకు సహాయం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలిసింది.

అందుబాటులో అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా భూ యాజమాన్య హక్కులు దక్కనివారు, పాసుపుస్తకాలు వచ్చినా తప్పులుండటం, విస్తీర్ణాలు తగ్గడం తదితర సమస్యలున్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఓటీపీ నమోదు వంటి పలు సాంకేతిక అంశాలపై గ్రామీణులకు అవగాహన ఉండటం లేదు. పైగా సెల్‌ఫోన్‌కు జిల్లా కలెక్టరేట్‌ నుంచి వచ్చే సంక్షిప్త సందేశాలు పలువురు రైతులకు అర్థం కావడం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని సహాయక కేంద్రాల్లో శిక్షణ పొందిన, సమస్యలపై అవగాహన ఉన్న అధికారులను, వారికితోడుగా సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని