Published : 28/11/2021 05:13 IST

ఒప్పందం ప్రకారమే బియ్యం తీసుకుంటాం

అగ్గి పెడతామంటూ దిల్లీ వెళ్లి ఏంచేశారు?: కిషన్‌రెడ్డి
ఉచిత విద్య, వైద్యంపై తొలిసంతకం: బండి సంజయ్‌
సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌. చిత్రంలో డి.కె. అరుణ, శివప్రకాశ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లు సహా అనేక విషయాల్లో లేని తప్పుల్ని భాజపాపై రుద్ది తెరాస ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం కేంద్రం పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం కొంటుందని స్పష్టంచేశారు.కేంద్రం కొత్త నిబంధనలేం తేలేదని వెల్లడించారు. ఈ సంవత్సరం ఉప్పుడుబియ్యం ఇవ్వబోమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. హుజూరాబాద్‌ ఓటమి నుంచి దృష్టి మళ్లించడానికి మాటమార్చిందని ఆరోపించారు. ‘‘అగ్గి పెడతానంటూ దిల్లీ వెళ్లిన సీఎం ఏం చేశారు? యుద్ధం చేయాల్సింది పాకిస్థాన్‌ వంటి శత్రుదేశాలపై.. కేంద్రంపై చేస్తారా?’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో శనివారం ఆయన ముగింపు ప్రసంగం చేశారు.

సీఎం ధర్నా రైతుల కోసం కాదు..

‘‘లేని సమస్యను సృష్టించి సీఎం ధర్నా చేశారు. కొడుకు సీఎం అవుతారో లేదోననే భయంతో కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి ధర్నాచౌక్‌కు వచ్చారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం 2014లో రూ.3,600 కోట్లు ఖర్చు పెట్టింది. 2021లో రూ.26,600 కోట్లు వెచ్చించింది. చివరిగింజ వరకూ కొంటామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయి? కేంద్రం రైల్వేలు, ఎల్‌ఐసీని అమ్మేస్తుందని కేసీఆర్‌ అంటున్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న హామీని కేసీఆర్‌ ఎందుకు నిలబెట్టుకోలేదు? హుజూరాబాద్‌ ఎన్నిక అయిపోగానే దళితబంధును మరచిపోయారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రమాదకరం. దళిత సీఎంపై మాటతప్పి.. రాష్ట్రం ఆగమైపోవద్దనే అలా చేయలేదంటూ దళితుల్ని అవమానిస్తున్నారు. వారికి పరిపాలించే శక్తి లేదా?’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.

సొంత పనులపైనే కేసీఆర్‌ దిల్లీకి  

అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ ‘కేసీఆర్‌ పతనం ప్రారంభమైంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఎన్నికలు ముందుగా వచ్చినా, 2023లో వచ్చినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే. వేదికపై ఉన్న మాలో ఎవరు ముఖ్యమంత్రి అయినా పేదలకు ఉచిత విద్య, వైద్యంపై తొలి సంతకం పెట్టించే బాధ్యత నాది’ అని అన్నారు. సీఎం దిల్లీకి వెళ్లి వచ్చింది సొంతపనుల కోసమేనని.. భాజపాను అప్రతిష్ఠపాలు చేసేందుకు, కేంద్రం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటూ సెంటిమెంట్‌ను రాజేసేందుకు యత్నించారని విమర్శించారు. ‘గడీల పాలననుంచి విముక్తికి ఉద్యమించే బాధ్యత నాది. త్యాగాలకు రక్తాన్ని ధారపోసేందుకు సిద్ధమా?’ అని కార్యకర్తల్ని ప్రశ్నించారు. ‘సీఎం కుర్చీ కోసం ప్రగతిభవన్‌లో కొట్లాట మొదలైంది’ అని అన్నారు.

హిందువులను ఒక్కటి చేస్తాం

తెలంగాణలో 80 శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే తెరాస, మజ్లిస్‌ కుట్రలు పటాపంచలై రాజ్యాధికారం పొందగలం. వచ్చే ఎన్నికల్లో హిందువుల్ని ఒక్కటి చేస్తాం. డిసెంబరు 17-20 మధ్య రెండోవిడత పాదయాత్ర ప్రారంభిస్తా’ అని సంజయ్‌ తెలిపారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను ఈ సందర్భంగా సన్మానించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి శివప్రకాశ్‌, నేతలు కె.లక్ష్మణ్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి విజయశాంతి, సంకినేని వెంకటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యవర్గం తీర్మానాలు

* ఏడున్నరేళ్ల తెరాస పాలనలో రాష్ట్రం అన్నిరకాలుగా నష్టపోయింది. అవినీతి రాజ్యమేలుతోంది. దుబారా ఖర్చులు తగ్గించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. భూమి, ఇసుక, మైనింగ్‌, మద్యం, మాదక ద్రవ్యాల మాఫియాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

* వర్షానికి తడిసిన వడ్లను కొనాలి. 60 లక్షల    మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి.  

* దళితబంధురాష్ట్రమంతా అమలుచేయాలి. దళితుల కోసం రూ.60వేల కోట్ల టిప్రైడ్‌ నిధుల్ని వాడాలి.

* ధరణి వెబ్‌సైట్‌ లోపాల్ని సరిదిద్ది రైతులకు న్యాయంచేయాలి.

* ఖాళీ పోస్టులను భర్తీచేయాలి. ఒక్కో నిరుద్యోగికి 35 నెలల నిరుద్యోగభృతి రూ. 1,05,560 ఇవ్వాలి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని