Published : 28/11/2021 05:16 IST

గ్యాస్‌ బండ పేలితే.. బీమా అండ

రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పొందే వీలు

ఎంత నిరుపేద కుటుంబమైనా ప్రస్తుతం వంటకు గ్యాస్‌ పొయ్యి వాడక తప్పని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి వరకు వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వీటి సంఖ్య 40 లక్షలు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో తరచూ జరుగుతున్న గ్యాస్‌ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి వల్ల వాటిల్లే ప్రాణ, ఆస్తి నష్టాలు బాధితులను కుంగదీస్తుంటాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులను ఆదుకోడానికి బీమా సదుపాయం ఉంటుంది. వినియోగదారుల తప్పిదాలు లేకుండా కేవలం సిలిండర్‌లోని లోపాల వల్ల ప్రమాదం జరిగితే బీమా పరిహారాన్ని పొందవచ్చు. ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలితే ఆయిల్‌ కంపెనీల ద్వారా రూ. 5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 50 లక్షల వరకు పరిహారం పొందొచ్చు. ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ గ్యాస్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం వంటి కంపెనీలే ప్రతి కనెక్షన్‌కు బీమా ప్రీమియం చెల్లిస్తాయి. వీటిపై అవగాహనలేక చాలామంది బీమా సొమ్ము పొందలేకపోతున్నారు.

గ్యాస్‌ ఏజెన్సీలు చేయాల్సిన పని..

ఎల్‌పీజీ బీమా పాలసీ వివరాలను నోటీస్‌ బోర్డులో ప్రదర్శించాలి. ఎల్‌పీజీ కంపెనీలు పబ్లిక్‌ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ పాలసీ (ప్రజా బాధ్యత బీమా) పాటిస్తాయి. సిలిండర్‌కు చిల్లులు, లేదా లీకేజీల వంటి కంపెనీ లోపాలుంటేనే బీమా వర్తిస్తుంది. ఈ బీమా కింద ప్రాణ నష్టం, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌, ఆస్తి నష్టానికి పరిహారం వంటి సదుపాయాలు పొందొచ్చు. బీమా మొత్తాన్ని ప్రమాద తీవ్రత, వ్యక్తి ప్రాతిపదికన అందజేస్తారు.

ప్రమాదం జరిగితే ఏం చేయాలి?

పొరపాటున ఎప్పుడైనా గ్యాస్‌ సిలిండర్‌ పేలి ప్రమాదం జరిగితే వెంటనే ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. నిర్ణీత సమయంలో ఏజెన్సీకి లిఖితపూర్వకంగా సమాచారం అందించాలి. ఆ తరువాత పంపిణీదారు (ఏజెన్సీ డీలర్‌) ఆ విషయాన్ని గ్యాస్‌ కంపెనీకి, బీమా సంస్థకు తెలపాలి. 30 రోజుల్లోగా కంపెనీ విచారణ పూర్తి చేసి క్లెయిమ్‌ సొమ్మును వినియోగదారులకు అందజేస్తుంది. ఒకవేళ దుర్ఘటనలో ఎవరైనా మరణిస్తే పరిహారం కోసం సంబంధీకులు కోర్టుకు సైతం వెళ్లొచ్చు. మృతుల వయసు, అప్పటివరకు వారి ఆర్జన సామర్థ్యాన్ని బట్టి న్యాయస్థానం పరిహారాన్ని నిర్ణయిస్తుంది.

ఈ నిబంధనలు పాటిస్తేనే

బీమా పొందాలంటే వినియోగదారులు స్టౌ, రెగ్యులేటర్‌, లైటర్‌ వంటివాటిని ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే వినియోగించాలి. నాసిరకం పొయ్యిలు, పైపులు వాడకూడదు. ‘సురక్ష’ గ్యాస్‌పైపునే వాడాలి. కనీసం రెండేళ్లకోసారి గ్యాస్‌ ఏజెన్సీ సిబ్బందితో సిలిండర్‌, పొయ్యి తనిఖీ చేయించుకోవాలి. వినియోగదారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినా, నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్‌ వినియోగించినా, లోపాలున్న పరికరాలను వినియోగిస్తున్నా పరిహారం వచ్చే  అవకాశం ఉండదు.


రూ.25 వేల తక్షణ సాయం పొందవచ్చు
- అశోక్‌, హైదరాబాద్‌ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు

వినియోగదారుల తప్పిదం వల్ల కాకుండా సిలిండర్‌ లోపాల వల్ల ప్రమాదాలు జరిగితే ‘నో ఫాల్ట్‌ లయబులిటీ’ కింద ఆయిల్‌ కంపెనీలు బీమా కల్పిస్తుంటాయి. గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న చాలామంది చిరునామా మారితే ఆ వివరాలను డిస్ట్రిబ్యూటర్‌కు తెలపడం లేదు. అధీకృత డిస్ట్రిబ్యూటరుకు తెలిపిన చిరునామాలోనే నివసిస్తూ ఉండాలి. దీర్ఘకాలికంగా వాడని కనెక్షన్లు డార్మెంట్‌ రిజిస్టర్‌లోకి వెళ్లిపోతాయి. అలాంటివాటిని బీమా ఇవ్వరు. గ్యాస్‌ ఏజెన్సీ సిబ్బందితో తప్పనిసరిగా తరచూ తనిఖీ చేయించుకుంటూ ఉండాలి. అలాగే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలు బాధితులకు ఒక్కొక్కరికి రూ. 25 వేలు చొప్పున తక్షణ సాయంగా అందిస్తాయి.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని