యాసంగి సాగుపై కొత్త విధానం!

తెలంగాణలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో యాసంగి పంటల సాగుకు సంబంధించి విధానపరమైన నిర్ణయంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రిమండలి సోమవారం ముఖ్యమంత్రి

Published : 29 Nov 2021 04:57 IST

 వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం

ఉద్యోగ నియామకాలపై చర్చ

నేడు సీఎం అధ్యక్షతన మంత్రిమండలి భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో యాసంగి పంటల సాగుకు సంబంధించి విధానపరమైన నిర్ణయంపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రిమండలి సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో భేటీ కానుంది. వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయడం, ఉద్యోగ నియామకాలపై స్పష్టత, కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దృష్ట్యా కరోనాపై వైద్యఆరోగ్యశాఖ సన్నద్ధత తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. యాసంగి వడ్ల కొనుగోలుపై స్పష్టత ఇవ్వకుండా రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందని, ఎన్నిసార్లు సంప్రదించినా.. వారి నుంచి సరైన సమాధానం లేదని రాష్ట్రప్రభుత్వం అసంతృప్తితో ఉంది. దీనిపై అధికార పార్టీ తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో సీఎం కేసీఆర్‌ స్వయంగా పాల్గొన్నారు. కొందరు మంత్రులు, అధికారులతో నాలుగురోజుల కిందటే దిల్లీ వెళ్లారు. అక్కడ రాష్ట్ర మంత్రులు.. కేంద్ర మంత్రులతో భేటీ అయినా స్పష్టమైన వైఖరి వెల్లడించలేదని అసంతృప్తితో ఉన్నారు. వీటిపై మంత్రిమండలి చర్చిస్తుంది.

ఉద్యోగ నియామకాలెలా!

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం ఇప్పటికే ఆర్థికశాఖ దస్త్రం రూపొందించింది. కొత్త జోనల్‌ విధానం అమలు తర్వాత 70 వేల నుంచి 80 వేల పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందనే దానిపైనా మంత్రిమండలి చర్చించి, అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. కరోనా పరిస్థితులపైనా చర్చించనుంది.  పోడు భూముల సమస్య, మెట్రో రైలు విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని