Published : 29/11/2021 02:28 IST

ఓ కన్నేసి ఉంచుదాం

గంజాయి సహా మాదకద్రవ్యాల వలలో యువత
తల్లిదండ్రులూ బహుపరాక్‌

తొలుత రుచి చూడాలనే తహతహతో మత్తు ఊబిలోకి దిగిన చాలామంది..క్రమంగా బానిసలుగా మారుతున్నారు. అప్పటికిగానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. వారికి తెలిసేసరికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆయా కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని, ప్రాథమిక దశలోనే పసిగట్టగలిగితే ‘మత్తు’ వదిలించేందుకు ఆస్కారం   ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతడు గంజాయి మత్తులో ఉన్నట్లు చికిత్సచేసే సమయంలో వైద్యులు గుర్తించారు. అప్పటివరకు తమ బిడ్డకు ఆ అలవాటు ఉన్నట్లు తెలుసుకోలేని తల్లిదండ్రులు నివ్వెరపోయారు. వైద్యుల సూచన మేరకు కుమారుడిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. అతడు మూడేళ్ల క్రితమే సిగరెట్లు, మద్యం తాగడం మొదలుపెట్టి ప్రస్తుతం గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల్ని తీసుకుంటున్నట్టు తేలింది. తరచూ గోవా నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు అతడు నిపుణుల కౌన్సెలింగ్‌లో వెల్లడించాడని తెలుసుకుని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

జడలు విప్పుతున్న మత్తు మహమ్మారి కారణంగా ఇలాంటి అనుభవం ఎందరో తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మత్తు పదార్థాల వినియోగం భారీగా పెరగడంతో యువత, ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎక్కువగా మాదకద్రవ్యాల బారినపడ్డారు. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌ నుంచి గ్రామాలకు వెళ్లిన ఇలాంటివారు..అక్కడి స్నేహితులకూ వీటిని అలవాటుచేశారు. ‘సులభంగా, చవగ్గా లభ్యమవడంతో మాదకద్రవ్యాల వ్యసనానికి గంజాయి గేట్‌వేలా మారిపోయిందని’ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఇలాంటివి మీ ఇంట్లో జరుగుతున్నాయా?

* పిల్లలు ఇంట్లో తీసుకునే డబ్బులకు కచ్చితమైన లెక్కలు అడగాలి. తరచూ సాధారణం కంటే ఎక్కువ డబ్బులు అడుగుతుంటే అప్రమత్తమై ఆరా తీయాలి. ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో, వసతిగృహాల్లో ఉంటే వాటిని ఆకస్మికంగా సందర్శిస్తూ పరిస్థితుల్ని గమనించాలి. ఇంటికి తరచూ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో(మాట తడబాటు, కళ్లు ఎర్రబారడం, మగతగా అనిపించడం వంటివి) గమనించాలి.

* విద్యార్థుల బ్యాగుల్లో ఒ.సి.బి.పేపర్‌, లైటర్‌ తదితర వస్తువులుంటే గంజాయి తాగుతున్నట్టు అనుమానించాలి. ఎక్కువగా తినడం, ఎక్కువగా నిద్ర పోవడమూ గంజాయి తాగే వారి ప్రాథమిక లక్షణంగా గుర్తించాలి. బ్యాక్‌లాగ్స్‌ పెరిగినా కారణాలను అన్వేషించాలి.

* ముందు మీ పిల్లల స్నేహితులు ఎలాంటి వారో గమనించాలి. వారితో కలిసి టెర్రస్‌పై ఎక్కువ సమయం గడుపుతుంటే.. ఏం చేస్తున్నారో కనిపెట్టాలి. పుట్టినరోజు వేడుకలు, లేదా ఇతరత్రా సాకులతో తరచూ బయటకువెళ్లి ఎక్కువ సేపు గడుపుతుంటే అనుమానించాలి. పర్యవేక్షకులెవరూ లేకుండా గోవా లాంటి పర్యాటక ప్రాంతాలకు పంపేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.

* అనవసరంగా అరవడం, ముభావంగా ఉండటం లాంటి విపరీత ధోరణుల్ని వ్యక్తం చేస్తుంటే వారి చరవాణుల్లో వాట్సప్‌, స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలీగ్రామ్‌లాంటి యాప్‌లను తనిఖీ చేయాలి. సాధారణంగా ఇలాంటి వేదికల్లోనే డ్రగ్స్‌ కోసం సంభాషణలు సాగించే అవకాశముంది. చాటింగ్‌లలో weed, score, stuff,stamp, acid, paper, ocb, coke, MD, joint,stash, mal, khash, stoner, peddler, dum,crystal, boom లాంటి పదాలు ఎక్కువగా వాడుతుంటే అనుమానించాల్సి ఉంటుంది.


ఒకసారి రుచిచూస్తే.. అంతే సంగతులు

జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించకూడని అంశాల్లో మాదకద్రవ్యాలు మొదటి వరసలో ఉంటాయి. ఎక్కువసార్లు తీసుకుంటేనే వ్యసనపరులవుతామనేదీ అపోహే. ఒక్కడోసు కూడా ప్రమాదకరమే. మత్తుపదార్థాలు సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచుతాయనేది పచ్చి అబద్ధం. వాటిని తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదురవుతాయనేది మాత్రం వాస్తవం. గంజాయికి అలవాటుపడిన వారిని డీఅడిక్షన్‌ కేంద్రాల్లో చేర్చి దాన్నుంచి విముక్తుల్ని చెయ్యొచ్చు.

- అంజిరెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌), హైదరాబాద్‌

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని