రాయలసీమను వీడని వాన

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో

Published : 29 Nov 2021 04:04 IST

కడప జిల్లా నరసరాంపేట సమీపంలో ఒరిగిపోతున్న భవనం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే బృందం: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. దక్షిణ అండమాన్‌ సముద్రంలో మంగళవారం అల్పపీడనమేర్పడి తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.30నుంచి రాత్రి 7గంటల మధ్య అత్యధికంగా నెల్లూరు జిల్లా చిల్లకూరులో 15.4, నాయుడుపేటలో 12.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 7.3, ఇరుగులంలో 7.1, కడప జిల్లా సిద్దవటంలో 6 సెం.మీ. వర్షం కురిసింది. విజయవాడలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత పడింది.

కుప్పకూలిన రెండంతస్తుల భవనం

కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని నరసరాంపేట సమీపంలో గుంజనేరు వాగు ఒడ్డున ఉన్న రెండంతస్తుల భవనం ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇటీవలి వర్షాలకు భవనం పాక్షికంగా దెబ్బతినడంతో అ కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. 

తిరుమల కనుమ దారిలో జాగ్రత్తలు

తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల-తిరుపతి మధ్య రెండు కనుమ దారులను ఆదివారం రాత్రి పదింటికి తితిదే మూసేయించింది. ద్విచక్రవాహనాలను రాత్రి ఏడింటికే నిలిపేశారు. సోమవారం వేకువజామున 2గంటల నుంచి నాలుగుచక్రాల వాహనాలను అనుమతించనున్నారు. నడక మార్గాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతిస్తున్నారు.

సోనూసూద్‌ ఫౌండేషన్‌ సాయం

తిరుపతి వరద బాధితులకు ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ ఫౌండేషన్‌ ద్వారా నిత్యావసరాలతో పాటు పలు రకాల వస్తువులను అందజేస్తున్నారు. రూ.900 విలువ ఉన్న కిట్లను ఫౌండేషన్‌ సభ్యుడు, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పాలకమండలి సభ్యుడు మించల ప్రదీప్‌ ఆధ్వర్యంలో బాధితులకు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 4వేల మంది బాధితులకు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు