బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ తీర్పును నోటిఫై చెయ్యొద్దు

బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును నోటిఫై చేయాలన్న కర్ణాటక వాదనను తెలంగాణ వ్యతిరేకించింది. 2013లో ట్రైబ్యునల్‌ తీర్పు వస్తే ఇప్పటివరకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చే తుది

Published : 29 Nov 2021 04:56 IST

 ప్రాజెక్టులు కట్టలేకపోతున్నామన్న కర్ణాటక వాదన అవాస్తవం

దాని అభ్యర్థనను తిరస్కరించండి

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన తెలంగాణ

  కర్ణాటక మధ్యంతర పిటిషన్‌పై నేడు విచారణ

ఈనాడు హైదరాబాద్‌: బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును నోటిఫై చేయాలన్న కర్ణాటక వాదనను తెలంగాణ వ్యతిరేకించింది. 2013లో ట్రైబ్యునల్‌ తీర్పు వస్తే ఇప్పటివరకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి అమలుచేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కర్ణాటక ఈ నెల తొలివారంలో సర్వోన్నత న్యాయస్థానంలో మధ్యంతర పిటిషన్‌ వేసింది. దీనిపై కోర్టు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక అభ్యర్థనను వ్యతిరేకిస్తూ కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌.. తాజాగా తెలంగాణ, మహారాష్ట్రలు అఫిడవిట్‌లు దాఖలు చేశాయి. కర్ణాటక వినతికి తెలంగాణ వ్యతిరేకత తెలపగా, మహారాష్ట్ర అనుకూలంగా స్పందించింది.

బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ 2010లో అంతర్‌రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్‌ 5(2) ప్రకారం మొదటి తీర్పు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే కోరగా, అభ్యంతరాలను ట్రైబ్యునల్‌కే చెప్పుకొనే వీలున్నందున దానిని వినియోగించుకోవాలంది. తర్వాత అవసరమైతే తమను ఆశ్రయించవచ్చంది. తదుపరి వాదనల అనంతరం 2013 నవంబరులో తుది తీర్పు ఇవ్వగా, దానిని వ్యతిరేకిస్తూ మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌.ఎల్‌.పి.) వేసింది. పునర్విభజన తర్వాత తెలంగాణ ఇందులో భాగస్వామి అయ్యింది. అప్పటి నుంచి ఈ ఎస్‌.ఎల్‌.పి.లు విచారణలో ఉండగా, తుది తీర్పునకు లోబడి కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశించాలని కర్ణాటక మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

మా అవసరాలను పట్టించుకోలేదు: తెలంగాణ

కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌-1, 2 తెలంగాణ అవసరాలను పట్టించుకోలేదని, న్యాయపరంగా దక్కాల్సిన వాటాను రాబట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విఫలమైందని తెలంగాణ పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చేసిన కేటాయింపులపై సమస్య లేదంది.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య వాదనలు జరుగుతున్నాయని తెలిపింది. కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఇచ్చిన రెండు తీర్పులను వ్యతిరేకిస్తామని పేర్కొంది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం కేటాయింపులు జరపడం వల్లే ఎగువన ప్రవాహాన్ని ఆపుతున్నారంది. ఆక్కడ ప్రాజెక్టులు నిండి, వినియోగం కూడా జరిగాకే దిగువకు వదులుతున్నారని తెలిపింది. కృష్ణా, తుంగభద్ర రెండు నదుల్లోనూ ఈ పరిస్థితి ఉందని పేర్కొంది. ఫలితంగా నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో తెలంగాణకు దైన్యస్థితి తప్పటం లేదని వివరించింది. మొదటి ట్రైబ్యునల్‌ 2130 టీఎంసీల నీటి లభ్యత తర్వాత క్యారీఓవర్‌ స్టోరేజికి అవకాశం కల్పించగా, ట్రైబ్యునల్‌-2 ఇందులో మార్పులు చేసిందని తెలంగాణ తెలిపింది. కర్ణాటక ఆలమట్టిలో 130 టీఎంసీల వినియోగానికి ట్రైబ్యునల్‌-2 తీర్పునకు ముందే ఏర్పాటు చేసుకొందని, గేటుపైన ప్లేటు పెట్టడమే మిగిలిందని, సింగటలూరు, అప్పర్‌తుంగ సహా అన్నిచోట్లా ఇదే పరిస్థితని పేర్కొంది. బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ తీర్పును నోటిఫై చేయకపోవడంతో నీటి కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోలేకపోతున్నామని కర్ణాటక పేర్కొనడం సత్యదూరమంది. వారి వాదన సరైంది కానందున పిటిషన్‌ను తిరస్కరించాలని కోరింది.

వినియోగానికి అనుమతించాలి: కర్ణాటక

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల అభ్యంతరాలపై తన సమాధానాలను కర్ణాటక తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొంది. అప్పర్‌ కృష్ణాలో 2022 జూన్‌ నుంచి 75 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని కోరింది. తుది తీర్పునకు లోబడి అది అమలై గెజిట్‌లో ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. ఎనిమిదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌-2 తీర్పును అమలుచేయకపోవడం వల్ల కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోతున్నామని మహారాష్ట్ర పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని