పూర్తయిన 83 కి.మీ.ల మూడో లైను

 ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్ని అనుసంధానించే కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో మూడోలైను నిర్మాణపనులు మరో మైలురాయిని చేరుకున్నాయి. విరూర్‌-మానిక్‌ఘర్‌ రైల్వేస్టేషన్ల మధ్య 19.2 కి.మీ. మార్గం పూర్తి కావడంతో

Published : 29 Nov 2021 04:25 IST

 కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో పురోగతి

ఉత్తరాదికి, దక్షిణాదికి కీలకం ఈ రైలుమార్గం

ఘట్‌కేసర్‌-కాజీపేట మూడో లైను వస్తే ప్రయోజనం

ఈనాడు, హైదరాబాద్‌:  ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్ని అనుసంధానించే కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో మూడోలైను నిర్మాణపనులు మరో మైలురాయిని చేరుకున్నాయి. విరూర్‌-మానిక్‌ఘర్‌ రైల్వేస్టేషన్ల మధ్య 19.2 కి.మీ. మార్గం పూర్తి కావడంతో మూడోలైను మొత్తంగా 83.2 కి.మీ. మేర అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని కాజీపేట మహారాష్ట్రలోని బల్లార్ష వరకు 202 కి.మీ. మేర మూడోలైన్‌ పనులు రూ.2,063 కోట్లతో చేపట్టారు. ఇందులో 43 కి.మీ. మార్గం మహారాష్ట్ర పరిధిలోనిది కాగా మిగిలింది తెలంగాణలో ఉంది. తొలుత రాష్ట్రంలో రాఘవాపురం-మందమర్రి మధ్య 33 కి.మీ., ఆపై పోత్కంపల్లి-రాఘవాపురం మధ్య 31 కి.మీ. పనులు పూర్తయి రైలుమార్గం వినియోగంలోకి వచ్చింది. తాజాగా మహారాష్ట్ర పరిధిలో 19.2 కి.మీ.మేర  పనులు పూర్తయ్యాయి.

* కాజీపేట నుంచి బల్లార్ష వరకు ప్రయాణికుల, సరకు రవాణా రైళ్లతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. మూడో లైను పనులన్నీ పూర్తయితే ఈ సెక్షన్‌లో రాకపోకల్లో సౌలభ్యం పెరుగుతుంది. అదనపు రైళ్లు ప్రవేశపెట్టడానికీ వీలుంటుంది.

* ఉత్తరాది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే రైళ్లు బల్లార్ష-కాజీపేట మార్గంలోనే రాకపోకలు సాగిస్తాయి. ఈ సెక్షన్‌లో అనేక పరిశ్రమలు ఉండటంతో సరకు రవాణా రైళ్లు గణనీయ సంఖ్యలో నడుస్తున్నాయి.

సికింద్రాబాద్‌-కాజీపేట మూడో లైన్‌ పూర్తయితేనే...

రాష్ట్రం నుంచి దిల్లీ వైపు రైళ్లు వేగంగా రాకపోకలు సాగించాలన్నా, అదనపు రైళ్లు ప్రవేశపెట్టాలన్నా సికింద్రాబాద్‌-కాజీపేట మార్గం అత్యంత కీలకమైంది. ఈ మార్గంలో మూడోలైన్‌ రావాలి. ఎంఎంటీఎస్‌ రెండోదశలో భాగంగా ఘట్‌కేసర్‌ వరకు నాలుగు లైన్ల మార్గం పూర్తయింది. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి(రాయగిరి) అదనపు లైన్‌ ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణలో మంజూరై ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు. రాయగిరి నుంచి కాజీపేట వరకు మూడోలైను మంజూరు కావాలి. సర్వే పూర్తయినా రైల్వేబోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని