
మిరప తోటలు పీకేస్తున్న రైతులు
తామర పురుగు ఉద్ధృతే కారణం
తెలుగు రాష్ట్రాల్లో అధ్యయనానికి బెంగళూరు శాస్త్రవేత్తలు
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తామరపురుగు అనే కొత్తరకం వైరస్ మిరప పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇలాంటి వైరస్‌ను ఇంతవరకూ ఎన్నడూ చూడలేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది మిరప ధరలు భారీగా పెరగడంతో అన్నదాతలు ఈసారి అధిక విస్తీర్ణంలో పంట సాగు చేశారు. తెలంగాణలో మొత్తం 3,58,557 ఎకరాల్లో సాగైంది. వైరస్‌తో పంట దెబ్బతినటంతో రైతులు పెద్దఎత్తున తోటలు పీకేస్తున్నారు. పూత, కాత దశలో ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించకపోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదు. ఈక్రమంలో ఖమ్మం జిల్లాలో గత మూడు రోజుల్లో ముగ్గురు మిరప రైతులు ఆత్మహత్యకు పాల్పడటం కలచివేస్తోంది.
30 నుంచి శాస్త్రవేత్తల పర్యటన
వైరస్‌తో దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలించేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ రీసెర్చ్, బెంగళూరు శాస్త్రవేత్తల బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనుంది. 30న వరంగల్ నుంచి హనుమకొండ జిల్లా నర్సంపేట మండలం, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం, డిసెంబరు 1న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పర్యటిస్తారని ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి బి.అనసూయ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. తెలంగాణ పర్యటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో పర్యటిస్తారని ఆమె తెలిపారు.